Sunday, November 17, 2024

గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద విసీల ఫైల్…

హైదరాబాద్ – 10 యూనివర్సిటీల వీసీల నియామకానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. మొన్నటి వరకూ పెండింగ్‌లో ఉన్న పాలమూరు, తెలుగు, జేఎన్టీయు ఫైన్‌ఆర్ట్స్‌ సెర్చ్‌ కమిటీ సమావేశాలు సైతం బుధవారం ముగిశాయి. దీంతో మొత్తం 10 వర్సిటీల వీసీల నియామకానికి సంబంధించిన ప్రధానమైన ప్రక్రియ పూర్తయ్యింది. ఈనెల 8వ తేదీన తెలంగాణ వర్సిటీ, 10న ఉస్మానియా, జేఎన్టీయూహైదరాబాద్‌, మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాల సెర్చ్‌ కమిటీల సమావేశాలు జరిగాయి.
ఈనెల 12 కాకతీయ, శాతశాహన యూనివర్సిటీల సమావేశాలు ముగిసాయి. అయితే మొదట తెలుగు, పాలమూరు, జెఎన్టీయుఎఫ్‌ఏ వర్సీటీలకు సెర్చ్‌ కమిటీల తేదీలు ఖరారు కాలేదు. అయితే ఈ మూడు వర్సిటీలకు మినహాయించి అప్పటికే సెర్చ్‌ కమిటీలు పూర్తయిన 7 వర్సిటీలకు సంబంధించిన వీసీల ప్రకటన ముందస్తుగా వస్తుందని ఆశావాహులు అంతా అనుకున్నారు. కానీ బుధవారం ఈ మూడు వర్సిటీల సెర్చ్‌ కమిటీలు కూడా భేటీ అయి ప్రక్రియను ముగించేశాయి. ఒక్కొక్క వర్సిటీకు ముగ్గురు చొప్పున పేర్లను ఖరారు చేసిన సెర్చ్‌ కమిటీలు మొత్తం 10 వర్సీటీలకు సంబంధించిన 30 పేర్లను ప్రభుత్వానికి నివేదించింది. సెర్చ్‌ కమిటీల ప్రక్రియ ముగియడంతో వీసీల నియామక ఫైల్‌ గవర్నర్‌ వద్ద ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వీసీల ప్రకటనను విడుదల చేయాలా వద్దా? అనే యోచనను ప్రభుత్వం చేస్తున్నది. వీసీల నియామక ప్రక్రియ గతంలోనే చేపట్టినప్పటికినీ ఈ పరిస్థితుల్లో వీసీల జాబితాను ప్రకటించి న్యాయపరమైన చిక్కులు, విమర్శలు కొనితెచ్చుకోవడం కంటే ఎన్నికల సంఘం అనుమతితో వీసీల జాబితాను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖను రాసినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించి వీసీల నియామకానికి అనుమతి వచ్చిన తరువాతే జాబితాను ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఎన్నికల సంఘం, గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల్లో నెలకొంది. అయితే వీసీల రేసులో ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు, సెట్స్‌ కన్వీనర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement