న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘వసుధైవ కుటుంబకం’ ఒక నినాదం మాత్రమే కాదని, భారతీయ జీవన విధానమని, ప్రపంచ శాంతికి భారతదేశం అందించిన శాంతి మంత్రమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు గౌరవభావంతో చూడటానికి కారణం మన సంస్కృతి, సంప్రదాయాలేనని ఆయన అన్నారు. శనివారం మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ (డబ్ల్యూఓఎస్‌వై) ఆధ్వర్యంలో ‘సంస్కృతి-సుస్థిరమైన భవిష్యత్ భాగస్వామ్యం’ ఇతివృత్తంతో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సుకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “భారతీయ సంస్కృతి, జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. ఈ భాషా, సాంస్కృతిక వైవిధ్యతలోనే ఐకమత్యం అనే మంత్రం అంతర్లీనంగా ఉంది. ప్రపంచంలోని మరేదేశానికీ సాధ్యం కాని రీతిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కనబరిచే ఏకైక దేశం భారతదేశం” అని అన్నారు.
భారతదేశానికి యువతే బలమైన శక్తి అని, అలాంటి యువత దేశంలోని అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. వచ్చే 25 ఏళ్ల కాలంలో (అమృత్ కాల్) భారతదేశాన్ని మరోసారి విశ్వగురువుగా నిలబెట్టే దిశగా తమవంతు ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. భారతదేశ భవిష్యత్తు అయిన యువతపై తనకు అపారమైన విశ్వాసం ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
భారతదేశాన్ని సృజనాత్మకతకు కేంద్రంగా చేయడం, భారతీయ జ్ఞానం ప్రపంచాన్ని నడిపించడం, దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చడ వంటివి అమృతకాలంలో మనందరి లక్ష్యాలు కావాలని కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తయ్యేనాటికి (2047) ప్రపంచ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా భారత్ మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించినట్లుగా సమస్యల నుంచి అవకాశాలను సృష్టించుకుంటూ.. అంతర్జాతీయ యవనికపై భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలన్నారు. జాతీయవాద భావనతో ముందుకెళ్లినపుడే అద్భుతాలు సృష్టించగలమని ఈ విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
5వేల ఏళ్లుగా భారతదేశానికి ప్రత్యేకతగా నిలిచిన భిన్నత్వం, బహుళత్వం, పరస్పర సమన్వయం, కళాత్మక స్వేచ్ఛ, భిన్న మతాలు, భిన్నమైన అంశాలను అంగీకరించే తత్వం వంటి వాటికి ఖజురహో సజీవ నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. దేశ విదేశాలనుంచి ఇక్కడకు పర్యాటకులు వస్తుండటం, ఖజురహో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో పర్యటిస్తుండటం ద్వారా మన దేశ సంస్కృతిని విదేశాలకు విస్తరిస్తోందని ఆయన అన్నారు.
భారతదేశంలోని 17 ఐకానిక్ సిటీల్లో ఖజురహోను చేర్చిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి.. ఈ దిశగా స్థానిక ఎంపీ విష్ణు దత్ శర్మ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఇక్కడ రైల్వేతోపాటు ఇతర వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విష్ణుదత్ శర్మ, భారతీయ పురాతత్వ విభాగం అధికారులు, డబ్ల్యూఓఎస్‌వై ప్రతినిధులు, యువకులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.