Saturday, November 23, 2024

బి.1.617 వేరియంట్‌కు ‘డెల్టా’గా నామకరణం

కరోనా వేరియంట్‌ బి.1.617ను ఇండియన్‌ వేరియంట్‌ అని పిల‌వ‌కూడ‌ద‌ని భార‌త ప్ర‌భుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అటు కొత్తగా వెలుగుచూసే ఏ కరోనా వేరియంట్‌నూ దేశాల పేర్లతో పిలవకూడదని WHO కూడా ఇటీవ‌లే స్ప‌ష్టం చేసింది. దీంతో కొత్త వేరియంట్‌ల‌కు WHO పేర్లు పెడుతోంది. భారత్‌లో వెలుగుచూసిన కొవిడ్‌ వేరియంట్‌ బి.1.617కు WHO ‘డెల్టా’గా నామకరణం చేసింది.

భారత్‌లో అంతకుముందు వెలుగుచూసిన కొవిడ్‌ వేరియంట్‌కు ‘కప్పా’ అని పేరు పెట్టింది. కొత్త పేర్లు పెట్టిన‌ప్ప‌టికీ ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ నామకరణాలను నూతన పేర్లు భర్తీ చేయవని స్ప‌ష్టం చేసింది. శాస్త్రీయ నామాలు విలువైన సమాచారం, పరిశోధనలో ఉపయోగపడతాయని తెలిపింది. కొత్త వేరియంట్ల గుర్తింపు, నివేదిక ఇవ్వడంలో ఏ దేశం నిరాకరించకూడదని కోరింది.

క‌రోనా వేరియంట్లను గ్రీక్‌ ఆల్ఫాబెట్‌లు అయిన ఆల్ఫా, బీటా, గామా తదితర పేర్లతో పిలవాలని WHOలోని నిపుణుల బృందం ఇటీవ‌లే సూచించింది. ఈ నేప‌థ్యంలో WHO వాటికి పేర్లు పెడుతోంది. ఈ పేర్లు సాధారణ ప్రజలు సైతం పలకడానికి సులువుగా ఉంటాయని తెలిపింది. బ్రిటన్‌ కొవిడ్‌ వేరియంట్‌కు ఆల్ఫా అని, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు బీటా అని, బ్రెజిల్‌ వేరియంట్‌కు గామా అని నామకరణం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement