Tuesday, November 26, 2024

కృష్ణా, మచిలీపట్నంలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు.. కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు, అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన రాజ్యసభ జీరో అవర్‌లో ముష్కరుల చేతుల్లో రాజకీయ హత్యకు గురైన వంగవీటి మోహన రంగా గొప్పతనం గురించి ప్రస్తావించారు. వంగవీటి రంగా గురించి తెలియని తెలుగు వారుండరని… పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఆయనను ఆరాధ్య దైవంగా కొలుస్తారని ఈ సందర్భంగా జీవీఎల్ కొనియాడారు. అత్యంత పెద్ద సామాజిక వర్గమైన కాపులకు చెందిన రంగా ఒక్కసారే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ గొప్ప ప్రజా నాయకుడిగా పేరు గడించారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

1986 డిసెంబర్‌లో కొందరు ద్రోహులు రంగాను హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతున్న తరుణంలో కాపునాడు సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నప్పుడు ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు. లక్షల మంది ప్రజలు, కాపు వర్గం నేతలు ఆయనను సమర్థించిన సమయంలో హతమార్చడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ప్రజలు తలచుకుంటారని జీవీఎల్ సభకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిందని వివరించారు.

ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు కానీ రంగా పేరును మాత్రం పెట్టలేదని అన్నారు. ఇతర నేతల పేర్లు జిల్లాలకు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి రంగా పేరు పెట్టడానికి ఎందుకు మనస్కరించలేదని ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు నిలదీశారు. పేద ప్రజల ఆశాజ్యోతిగా పేరు గడించిన కాపు నేత రంగా పేరును కృష్ణా లేదా మచిలీపట్నం జిల్లాల్లో ఒక దానికి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement