Thursday, November 21, 2024

వందేభారత్ వస్తున్నాయి.. ప్యాసింజర్ రైళ్లు పోతున్నాయి : బి. వెంకట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ఎగువ మధ్యతరగతి, ధనికవర్గం ప్రయాణించే వందేభారత్ రైళ్లు వస్తున్నాయని, కానీ సాధారణ నిరుపేదలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లు మాత్రం క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వందేభారత్ రైళ్లను గొప్ప చవకైన ప్రయాణ సౌకర్యాన్ని అందజేసినట్టు ఆర్భాటపు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో 1853లోనే రైల్వే వ్యవస్థ ప్రారంభమైందని, 170 ఏళ్లలో రైల్వేలు దేశ ప్రజలకు చవకైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాయని, అలాగే అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు కూడా పేదల ప్రయాణానికి అనుకూలంగా ఉండేవని గుర్తుచేశారు.

అయితే ప్రధాని మోదీ వందే భారత్ రైలును అత్యంత ఖరీదైన ప్రయాణంగా మార్చారని విమర్శించారు. కోట్లాదిమంది పేదలకు అనుకూలంగా ఉండే ప్యాసింజర్ రైలును రద్దు చేయడమేగాక ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను రద్దుచేసి ఏసీ బోగీలు ఏర్పాటు చేయడం అంటే పేదలకు ఉన్న చౌకైన ప్రయాణాన్ని రద్దు చేయడమేనని అన్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా తత్కాల్ టికెట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్లు అంటూ కొత్త కొత్త పేర్లు పెట్టి రూ. 1,000 ఉన్న టికెట్ ధరను రూ. 3,000 కు పెంచి ప్రజల మీద విపరీతమైన భారాన్ని మోపుతున్నారని అన్నారు. ఇది రైల్వేల ద్వారా ప్రజలకు అందించాల్సిన సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని తలకిందులు చేసే విధంగా ఉందని విమర్శించారు.

దేశంలో 3,752 రైళ్లు ఉండగా కోవిడ్ కాలంలో ఆపిన ప్యాసింజర్ రైళ్లను ఇంతవరకు ప్రారంభించలేదని,  కోట్ల మంది ప్రజలకు ప్యాసింజర్ రైళ్లు ఆధారంగా ఉన్నాయని అన్నారు. చౌక ప్రయాణమే కాక దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లటానికి రైల్వే గొప్ప అనుసంధానంగా ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రతి రోజూ కేంద్రం డీజిల్ రేట్లు  పెంచడం, దానికి తోడు తరచుగా టోల్ చార్జీలు పెరగటంతో ఆర్టీసీ బస్సు చార్జీలు క్రమంగా పెరిగి పేదలకు అందని స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఈ స్థితిలో కేంద్రం అత్యంత ఖరీదైన చార్జీలతో  కూడిన వందే భారత రైళ్లను ప్రారంభించి, ఉన్న ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు.

ఇటీవల అంబేద్కర్ జయంతి సభలను ఆర్భాటంగా నిర్వహించిన బీజేపీ, మరోవైపు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. భారత చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, చారిత్రక వాస్తవాలన్నీ రూపుమాపాలని ప్రయత్నిస్తోందని అన్నారు. అస్పృశ్యతపై గాంధీ చేసిన పోరాటాలను తొలగించటం అంటే సామాజిక వివక్షత నిర్మూలన కోసం ఉన్నటువంటి చట్టాలను, హక్కులను పథకాలను క్రమంగా కనుమరుగు చేయడమే అని అన్నారు. చరిత్రలో వివక్ష ఉంది కాబట్టే నేడు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, చరిత్రలో ఆ అంశం లేకుండా చూపటం ద్వారా సామాజిక తరగతులకు ఇస్తున్నటువంటి అవకాశాలను తొలగించే కుట్ర దాగి ఉందని అన్నారు.

- Advertisement -

ఏడాదికిపైగా కార్మికులు, ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తుంటే జగన్ వారికి మద్దతు ప్రకటించటం గాని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం గాని చేయకపోవడం సిగ్గుచేటని బి. వెంకట్ విమర్శించారు. కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కార్పొరేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా సరే మాట్లాడడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధానాలను ప్రతిఘటిస్తూ 6 నెలల పాటు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. దళితుల సమస్యలపై దశలవారీగా ఆందోళన చేపడతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement