న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పన బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ( వీఆర్పీఎస్ ) డిమాండ్ చేసింది. వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో వాల్మీకుల సంకల్ప దీక్షలో ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వందలాది మంది నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్థుడు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ గత మార్చి 24వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసిందని తెలిపారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి చట్టబద్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు బహిరంగ సభలో కూడా వాల్మీకులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సుభాష్ చంద్రబోస్ హెచ్చరించారు. ఢిల్లీ వాల్మీకి నేత, వీఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవీందర్, వాల్మీకి జాతీయ మహిళా నాయకురాలు ప్రియాంక… ఆంధ్రప్రదేశ్ వాల్మీకుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.