కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పురుషల్లో లైంగిక సామర్థ్యం తగ్గలేదని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ మియామీ పరిశోధకులు తమ నివేదికలో ఈ విషయాన్ని చెప్పారు. రెండు డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో.. వీర్యకణాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. మొత్తం 45 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత వారి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించారు. నిజానికి అమెరికాలో ఓ భయం వ్యాప్తిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతున్నట్లు జనం భయపడుతున్నారు. అయితే మియామీ వర్సిటీ స్టడీ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది.
లైంగిక సామర్థ్య పరీక్షలో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైటజర్ టీకాను, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు టీకాలను ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారు చేశారు. అయితే వారి వీర్యకణాలకు జరిపిన పరీక్షల్లో.. బేస్‌లైన్ స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్, టోటల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియన్లు/ఎంఎల్, 36 మిలియన్లు ఉన్నట్లుగా నిర్ధారించారు. రెండవ డోసు తర్వాత వారిలో వీర్యకణాల సంఖ్య స్వల్పంగా 30 మిలియన్లు/ఎంఎల్, టోటల్ కౌంట్ 44 మిలియన్లకు పెరిగినట్లు తేల్చారు. టీకా తీసుకున్న తర్వాత ఎంత పరిమాణంలో వీర్యం ఉత్పత్తి అవుతున్నది, వీర్యకణాలు దూసుకెళ్లుతున్న తీరు ఎలా ఉందో స్టడీలో నిర్ధారించారు. సీమెన్ వాల్యూమ్‌తో పాటు స్పెర్మ్ మొటిలిటీ కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు చెప్పారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ నివేదికను ప్రచురించారు.