Tuesday, November 26, 2024

వ్యాక్సిన్‌ కేంద్రాలుగా విద్యా సంస్థలు!

కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతోన్న కర్ణాటక ప్రభుత్వం.. వైరస్‌ కట్టడి చర్యలతో పాటు వ్యాక్సిన్‌ కేంద్రాలపై దృష్టి సారించింది. వ్యాక్సిన్‌ కేంద్రాలకు వచ్చే ప్రజలు వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆసుపత్రులు, ఆరోగ్యకేంద్రాల్లో కాకుండా సురక్షిత ప్రాంతాలైన పాఠశాలలు, కాలేజీ ప్రాంగణాల్లోకి మార్చేందుకు సిద్ధమయ్యింది. కరోనా వైరస్ ఉద్ధృతితో కర్ణాటక అతలాకుతలమవుతోంది. నిత్యం అక్కడ కొత్తగా 40వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఓవైపు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోన్న ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం లబ్ధిదారులకు ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపడుతున్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పాఠశాలలు, కాలేజీలతో పాటు సురక్షిత ప్రాంతాలకు మార్చాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతిపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

మరోవైపు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న బాధితులతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులు తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకునేందుకు వారికి పల్స్‌ ఆక్సీమీటర్లు అవసరమని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అభిప్రాయపడింది. దీంతో 2లక్షల పల్స్‌ ఆక్సీమీటర్లను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, టాక్స్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను మరింతగా పెంచేందుకు కోటి ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌లను సేకరిస్తామని తెలిపారు. వీటితోపాటు డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 1000 ఆక్సికేర్‌ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా 5లక్షల రెమ్‌డెసివిర్లు సేకరించేందుకు గ్లోబల్‌ టెండర్లను పిలుస్తామని, ఇందుకు దాదాపు 75కోట్లు కేటాయించామన్నారు. వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌లను గుర్తించేందుకు అదనంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అశ్వత్‌ నారాయణ్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే.. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తొలిస్థానంలో ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో దాదాపు 6 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఇక్కడ 20వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక బెంగళూరులో కరోనా తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement