Tuesday, November 26, 2024

టీకాల సంపదతో కొత్తగా కుబేరులైన తొమ్మిది మంది..

కరోనా సంక్షోభం ప్రపంచాన్ని కుదేలు చేసింది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కానీ కొందరిని మాత్రం కోట్లకు పడగలెత్తించింది. టీకా సాంకేతికతపై గుత్తాధిపత్యం పోవాలని ప్రచారం చేస్తున్న పీపుల్ వ్యాక్సిన్ అలయెన్స్ అనే సంస్థ ఈ సంగతులు వెల్లడించింది. ముఖ్యంగా టీకాల సంపదతో కొత్తగా 9 మంది కుబేరులుగా అవతరించారట. 9 మంది టీకాల ఉత్పత్తిదారులు మొత్తం 1930 కోట్ల డాలర్లు సంపాదించుకున్నారట. అది మన భారతీయ కరెన్సీలో రూ. 1,44,750 లక్షల కోట్లు. ఈ మొత్తంతో అల్పాదాయ దేశాల్లోని వారందరికీ 1.3 సార్లు పూర్తి వ్యాక్సిన్ ఇవ్వొచ్చునని పలు సంఘాల, సామాజిక కార్యకర్తల సమాఖ్య అయిన అలయెన్స్ తెలిపింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా వివరాల ఆధారంగా ఈ లెక్కలు తేల్చినట్టు వివరించింది.

టీకాలపై మేధోహక్కులు, పేటెంట్లను రద్దుచేయాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తున్నది. టీకాలపై గుత్తాధిపత్యంతో ఫార్మా కంపెనీలు సంపాదిస్తున్న లాభాలకు ఈ కుబేరులు అద్దం పడుతున్నారని పేర్కొన్నది. ఈ తొమ్మిది మంది కాకుండా ఎనిమిది మంది ఇదివరకటి కుబేరుల సంపద 3220 కోట్ల డాలర్లు (రూ.2,41,500 కోట్లు) పెరిగింది. కొత్తగా కుబేరులైన తొమ్మిది మందిలో మోడర్నా వ్యాక్సిన్ అధినేత స్టెఫానె బాన్సెల్, బయోఎన్‌టెక్ అదిపతి ఉగుర్ సహిన్ జాబితాలో అగ్రభాగాన ఉన్నారు. ఇందులో తూర్పు, పడమర భేదాలు కూడా లేవు. ఎందుకంటే ఈ జాబితాలోని మరో ముగ్గురు కుబేరులు చైనా టీకా కంపెనీ కాన్‌సినో బయోలాజిక్స్ సహ-వ్యవస్థాపకులు. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్‌లపై తాత్కాలికంగానైనా పేటెంట్లను ఎత్తివేయాలని డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల వర్ధమాన దేశాల్లో ఉత్పత్తి పెరుగుతుందని, టీకా అసమానతలు తొలగిపోతాయని అంటున్నారు. ఇండియా, అమెరికా, దక్షిణాఫ్రికా, చైనాలతో పాటుగా కేథలిక్కు క్రిస్టియన్ల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement