Tuesday, November 26, 2024

Delhi | ఓబీసీ జాబితాలోకి త్వరలో ఉత్తరాంధ్ర 4 కులాలు.. జాతీయ బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడి తరగతుల (బీసీ) జాబితాలో ఉన్న తూర్పు కాపులు, కళింగ వైశ్యులు, శిష్ట కరణాలు, సోంధీ కులాలు జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం జాతీయ బీసీ కమిషన్ ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయగా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో ఆయా కులాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ హియరింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎంపీలు కే. రామ్మోహన్ నాయుడు (టీడీపీ), బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్సీపీ), డా. కే. లక్ష్మణ్ (బీజేపీ) కూడా హాజరయ్యారు. జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో లేకపోవడంతో ఈ నాలుగు కులాలకు జాతీయస్థాయి విద్య, ఉపాధి అవకాశాల్లో అన్యాయం జరుగుతోందని నేతలు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్‌కు తెలిపారు.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడడంతో పాటు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలోనే ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న ఈ కులాలను జాతీయ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో ఈ నాలుగు కులాల ప్రతినిధులను ఎంపీ జీవీఎల్ ఢిల్లీ తీసుకొచ్చి జాతీయ బీసీ కమిషన్‌తో పాటు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిని కలిశారు. తమను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని వినతి పత్రాలు అందజేశారు.

- Advertisement -

అయితే ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కమిషన్ ఛైర్మన్ తెలిపారు. ఆ మేరకు ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న తర్వాత తొలిసారిగా కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. అనంతరం ఈ నాలుగు కులాలను జాబితాలో చేర్చమంటూ కేంద్రానికి సిఫార్సు చేస్తామని కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ హామీ ఇచ్చారు.

ఈ వర్గాలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాలు – జీవీఎల్

తూర్పు కాపులు, కళింగ వైశ్యులు, శిష్ట కరణాలు, సోంధీ కులాల విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఇన్నాళ్లుగా జాతీయ స్థాయిలో రిజర్వేషన్ సదుపాయాన్ని పొందలేకపోయాయని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు అన్నారు. జాతీయ బీసీ కమిషన్ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పు కాపులను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చినప్పటికీ, ఆ రిజర్వేషన్ ఫలాలను కేవలం మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం చేశారని తెలిపారు.

2008లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పు కాపులకు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను రాష్ట్రమంతటా అమలయ్యేలా చేసిందని, ఆ మేరకు జాతీయ స్థాయిలోనూ మార్పులు చేయాలని బీసీ కమిషన్‌ను కోరినట్టు జీవీఎల్ చెప్పారు. గత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అంతటా నివసిస్తున్న తూర్పు కాపులకు జాతీయస్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లు చాలా ఏళ్ల క్రితమే లభ్యమయ్యేవని అన్నారు.

మరోవైపు కళింగ వైశ్య కులానికి 2014లో బీసీ హోదా ఇచ్చినప్పటికీ.. జాతీయస్థాయిలో ఓబీసీల జాబితాలో చేర్చాలంటూ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని, తాను చొరవ తీసుకుని ఆ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టానని చెప్పారు. అలాగే శిష్ట కరణాలు, సోంధీ కులాల గురించి మాట్లాడుతూ.. 2009లో దలవ సుబ్రమణ్యం కమిషన్ సిఫారసుల మేరకు ఈ రెండు కులాలకు రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు గుర్తుచేశారు. ఈ అంశాన్ని తాను ఎన్సీబీసీ, కేంద్ర సామాజిక న్యాయ శాఖ దృష్టికి తీసుకెళ్లే వరకు వారిని కేంద్ర ఓబీసీల జాబితాలో చేర్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని అన్నారు.

సుదీర్ఘ కాలంగా జరిగిన జాప్యం కారణంగా ఈ కులాలకు చెందిన లక్షలాది మంది యువత కేంద్రం ఇచ్చే రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోయారని అన్నారు. ఎన్సీబీసీ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌ అనంతరం నాలుగు కులాలను త్వరలో ఓబీసీల్లో చేర్చనున్నట్లు ఛైర్మన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని, తద్వారా ఆ కులాలకు సామాజిక న్యాయం లభిస్తుందని అన్నారు. మరోవైపు తెలంగాణలో ఉత్తరాంధ్ర బీసీ కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 328 (బి)ను ఉల్లంఘించడమేనని అన్నారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 26 కులాలను తొలగించిన విషయాన్ని జాతీయ బీసీ కమిషన్ ఎదుట జీవీఎల్ ప్రస్తావించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో ఈ కులాలకు చెందిన 10 లక్షల మందికి పైగా నివసిస్తున్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో జాతీయ బీసీ కమిషన్ జోక్యం చేసుకుని ఆ 26 కులాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement