Saturday, September 28, 2024

Uttarakhand – మంచుకొండల్లో మృత్యుఘోష – ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది దుర్మరణం ….


ముంచెత్తిన అవ‌లాంచి
ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది మృతి
ఆక‌స్మికంగా చెల‌రేగిన‌ మంచు తుపాన్
ఏకంగా 18 మంది గ‌ల్లంతు
తొమ్మిది మృతదేహాల వెలికితీత
మృతులంతా క‌ర్నాట‌క వాసులే
ఉత్త‌రాఖండ్‌లో కొన‌సాగుతున్న స‌హాయక చ‌ర్య‌లు

ఉత్త‌రాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో విహారయాత్రకు వెళ్లిన కన్నడిగులకు చేదు అనుభవం ఎదురైంది. నిత్య జీవితంలో ఒత్తిళ్ల నుంచి దూరంగా పర్వతారోహణకు వెళ్తే పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉత్తరకాశీ, తెహరి జిల్లా సరిహద్దు భాగాల్లో మంచుకొండల్లో ట్రెక్కింగ్‌ చేస్తున్నవారిలో కర్నాటకకు చెందిన 18 మందితో పాటుగా 22 మంది వర్షం, మంచు, ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు మిస్సయ్యారు. సహస్రతల్‌ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

- Advertisement -

మంచులో మ‌రికొంద‌రు..

ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్నాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు దగ్గర బుధవారం ట్రెక్కింగ్ చేస్తున్నారు. వీరంతా హఠాత్తుగా మంచులో చిక్కుకుపోయారు. వీరిలో తొమ్మిది మంది మరణించగా మరో తొమ్మిది మంది జాడ తెలియలేదని అధికారులు తెలిపారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే అక్కడి ప్రభుత్వం సైన్యం, హెలికాప్టర్లతో సహాయక చర్యలను చేపట్టింది. కర్నాటకకు చెందిన పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. సౌమ్య వివేక్‌ (37) వినయ్‌ కృష్ణమూర్తి (47) శివజ్యోతి, సుధాకర్, బీ.ఎన్‌.నాయుడు (64), సతి గురురాజ్‌ (40), సీనా (48)తో పాటు పలువురిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.

తొమ్మిది మంది జాడ‌లేదు..

బెంగళూరుకు చెందిన సుజాత (52), పదిని హెగ్డే (35), చైత్ర (48), సింధు (45) వెంకటేశ్‌ ప్రసాద్‌ (55), అనిత (61), ఆశా సుధాకర్‌ (72), పద్మనాభ్‌ కేపీఎస్‌ (50), వినాయక్‌ (52) మర‌ణించిన‌ట్లు ఉత్తరాఖండ్‌ అధికారులు తెలిపారు. 13 మంది ఆరోగ్యం విషమంగా ఉండగా వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గత నెల 29 నుంచి ట్రెక్కింగ్‌

ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫెడరేషన్‌ ద్వారా హిమాలయాల అధిరోహణకు మే 29వ తేదీన వీరంతా వెళ్లినట్లు తెలుస్తోంది. జూన్‌ 7వ తేదీన తిరిగి రావాలి. అయితే మార్గమధ్యలో సహస్రతాల్‌ అనే చోట విపరీతమైన మంచు తుపాను, చలిగాలుల్లో చిక్కుకుపోయారు. ఆ బృందంలో 18 మంది బెంగళూరువాసులు, ఒకరు పూణెవాసి, ముగ్గురు స్థానిక గైడ్లు ఉన్నారు. క‌ర్నాట‌క మంత్రి కృష్ణభైరేగౌడ బాధితులకు సహాయం కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement