యూపీలోని బలియాకు చెందిన 35 ఏళ్ల ఓ వ్యక్తి మహిళలకు అదేపనిగా కాల్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా దాదాపు 370 మంది మహిళలకు వీడియో కాల్స్ చేసి అభ్యంతరకరంగా వ్యవహరించాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మహిళా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వీడియో కాల్స్‌ను రికార్డు చేసి ఎవరైనా తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన మహిళలను నిందితుడు బ్లాక్‌మెయిల్‌కు గురిచేసేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో నిందితుడిపై తొలిసారిగా లక్నోలో ఫిర్యాదు నమోదైంది.
కాగా నిందితుడిని బలియా జిల్లా గర్హవార్ పోలస్ స్టేషన్ పరిధిలో స్టేషనరీ షాపు నిర్వహించే శివ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వాట్సాప్ మెసెంజర్ ద్వారా నిందితుడు 15 జిల్లాలకు చెందిన దాదాపు 370 మంది మహిళలను వేధించాడు. ఈ నేరాన్ని చేసేందుకు శివకుమార్ వేర్వేరు సిమ్ కార్డులతో ఏడు సెల్ ఫోన్‌లను వాడేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు స్టేషనరీ షాపులో పని ముగించుకున్న తర్వాత కొన్ని నెంబర్లను సేకరించి ట్రూకాలర్ ద్వారా వారు మహిళలని నిర్ధారించుకున్న తర్వాత వారికి వాట్సాప్ వీడియో కాల్స్ చేసేవాడు. వీడియో కాల్‌లో నగ్నంగా మారి ముచ్చటించేవాడు. మహిళ కాల్‌ను కట్ చేసే లోపే వీడియో స్క్రీన్ రికార్డర్ ద్వారా సంభాషణను రికార్డు చేసేవాడు. కాగా నిందితుడు శివకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.