Friday, November 22, 2024

Uttar Pradesh ర‌క్తం మ‌రిగిన కిల్ల‌ర్ ఊల్ఫ్‌ …

జ‌నాల‌పై మ‌రోసారి అటాక్‌
11 ఏళ్ల బాలికకు గాయాలు
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘ‌ట‌న‌
రెండు నెల‌ల్లో ప‌ది మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడి ఆగడం లేదు. మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్లు రెండు నెలలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటికే పది మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో చిన్నారిపై తోడేలు దాడి చేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 11 ఏళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన హాస్పిట‌ల్‌కు తరలించారు. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది.

కంటిమీద కునుకులేకుండా చేస్తున్న‌య్‌..

సుమారు 50 రోజుల నుంచి బహరాయిచ్‌ సహా మరికొన్ని జిల్లాలో ఆరు తోడేళ్ల గుంపు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండటం కలచి వేస్తోంది. వీటి దాడిలో సుమారు 37 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్‌ ఆపరేషన్‌ భేడియా చేపట్టింది. ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను బంధించారు. మంగళవారం ఉదయం కూడా ఓ తోడేలును అటవీ శాఖ అధికారులు బంధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆరో తోడేలు కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అది చిన్నారిపై దాడి చేసింది.

టెడ్డీబేర్ల‌తో అట‌వీశాఖ‌ ట్రాప్‌..

- Advertisement -

తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు. తోడేళ్లు రాత్రి వేళ జనంపై దాడి చేసి, ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతున్నాయని డివిజినల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అజిత్‌ ప్రతాప్‌ సింగ్‌ చెప్పారు. ఈ తోడేళ్ల గుంపు దాడుల కారణంగా సుమారు రెండు నెలలుగా బహరాయిచ్‌లోని 35 గ్రామాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ చేస్తున్నారు. తోడేళ్ల దాడుల్ని ‘వైల్డ్‌లైఫ్‌ డిజాస్టర్‌’గా యూపీ సర్కార్‌ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement