లక్నో – ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది.
వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా, వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు, ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కన్నౌజ్‌లోని తిర్వా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని సైఫాయి మెడికల్ యూనివర్సిటీ వైద్యులుగా గుర్తించారు. వీరంతా పీజీ విద్యార్థులే. దీంతో పాటు కారులో ఉన్న మరో పీజీ విద్యార్థికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరారు.
కారులోని వారందరూ లక్నోలో వివాహ వేడుకకు హాజరై తిరిగి సైఫాయికి వస్తుండగా తిర్వా ప్రాంతంలో వారి కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతలి లేన్‌లోకి వచ్చి పడిన సమయంలో ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు వైద్యులు మరణించారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్‌ను సైఫాయి మెడికల్ యూనివర్సిటీలో చేర్పించారు.
యుపిఇడిఎ వాహనంలో 6 మందిని ఇక్కడికి తీసుకువచ్చామని, అందులో ఐదుగురు మరణించారని మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తిర్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వీరంతా సైఫాయి మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులని ఆయన అన్నారు.