కోదాడ, ప్రభన్యూస్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఈనెలాఖరకు రద్దయి, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంటు- సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ”హత్ సే హత్ జోడో అభియాన్” కార్యక్రమం సందర్భంగా కోదాడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. కేసీఆర్ హడావుడి చూస్తుంటే ప్రభుత్వ రద్దుకు పోయే ఆలోచనలు కనిపిస్తున్నట్లు- ఉన్నాయన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక, అవినీతి పాలనపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర ప్రపంచంలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.
దేశంలో కులాలను, మతాలను విభజించి విధ్వంసకర పాలనను మోడీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటు-ంబం అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఇంటికి పోవడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ సభ్యత నమోదులో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాయని ఉత్తమ్ అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్కే బషీర్, చింతలపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వంగవీటి రామారావు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.