న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఏఐసీసీ కార్యాలయం సాక్షిగా కాంగ్రెస్ ముఖ్యనేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా రేవంత్ దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తవాళ్లకు స్వాగతం చెప్తూనే చేరికలపై మాట్లాడడానికి పదవుల్లో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వార్ రూం నుంచే తనపై దుష్ర్పచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. తనపై పుకార్ల వెనుక రేవంత్ ఉన్నారంటూ ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. పార్టీలో కొందరు తనను కావాలనే టార్గెట్ చేశారని అన్నారు. ఓ ఛానెల్ పేరు చెప్పి మీ వాడిని కంట్రోల్ చేయండంటూ రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కొంతకాలంగా రేవంత్ రెడ్డి – ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఉత్తమ్ పార్టీ వీడతారని ప్రచారం కూడా సాగింది. గతంలో ఉత్తమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అధిష్టానం పెద్దల జోక్యంతో తర్వాత ఆ దుమారం సద్దుమణిగింది. పొంగులేటి చేరిక సందర్భంగా మళ్లీ ఢిల్లీలో నేరుగా రేవంత్ పేరు చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు.