Tuesday, November 19, 2024

లోక్‌సభలో ‘పసుపు’ రగడ

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై లోక్‌సభలో రగడ చోటు చేసుకుంది. తెలంగాణ‌లో ప‌సుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లోక్‌స‌భ‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నో ఏళ్ల నుంచి రైతులు ప‌సుపు బోర్డు కోసం ఆందోళ‌న‌లు చేస్తున్న‌ట్లు గుర్తుచేశారు. 80 శాతం ప‌సుపు ఇండియాలో ఉత్ప‌త్తి అవుతోంద‌ని, దాంట్లో 50 శాతం తెలంగాణ‌లోనే ఉత్ప‌త్తి అవుతోంద‌న్నారు. బోర్డు ఏర్పాటు చేయ‌డంలో స‌మ‌స్య ఏంట‌ని ఆయ‌న ప్రశ్నించారు.

ఉత్తమ్ ప్రశ్నలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల కోసం ప్రోత్సాహక బోర్డు ఉన్న‌ట్లు తెలిపారు. నిజామాబాద్‌లో కేవ‌లం ప‌సుపు కోసం ప్ర‌త్యేక సెంట‌ర్ పెట్టిన‌ట్లు చెప్పారు. కానీ ప్ర‌త్యేక బోర్డు పెట్ట‌లేదన్నారు. ఈ సంద‌ర్భంలో ఉత్త‌మ్ మాట్లాడుతూ.. కేవ‌లం స్పై బోర్డు ఎక్స్‌టెష‌న్ మాత్ర‌మే నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి చెబుతున్నార‌న్నారు. ట‌ర్మ‌రిక్ బోర్డు ఏర్పాటు చేస్తే రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చని పేర్కొన్నారు. పసుపు రైతుల కోసం స్థానిక ప్రభుత్వంతో కలిసి పార్కును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి పురుషోత్తం మరోసారి చెప్పారు కానీ పసుపు బోర్డుపై క్లారిటీ ఇవ్వలేదు. అటు జాతీయ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేయాలని కర్ణాటక ఎంపీ బచ్చేగౌడ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement