Tuesday, November 26, 2024

సబ్‌ప్లాన్‌ నిధులు సద్వినియోగం.. ఎస్సీ గ్రామాలు, వాడల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యత : మేరుగు నాగార్జున..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించిన సబ్‌ ప్లాన్‌ నిధుల్లో ఒక్క రుపాయి వృధా అయినా సహించేది లేదని, వాటిని సద్వినియోగం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులకు సూచించారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల్లో ప్రతిపైసా కూడా ఎస్సీల అభివృద్ధికి ఉపయోగపడేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులమీదే ఉందన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఉప ప్రణాళికపై గురువారం జరిగిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి నాగార్జున మాట్లాడుతూ, ఒక ఆర్థిక సంవత్సరంలో వాడుకోకుండా మిగిలిపోయిన నిధులను మరో సంవత్సరంలో వాడుకొనే అవకాశం సబ్‌ ప్లాన్‌ నిధుల్లో ఉండదని వెల్లడించారు. ఏ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన నిధులను అదే ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే సబ్‌ ప్లాన్‌ ద్వారా బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం మంజూరు చేసిన నిధులలో ప్రతి పైసా కూడా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా ఆదేశించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్‌ 2019-20లో రూ.15000 కోట్లు-, 2020-21లో రూ.15735 కోట్లు- ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కోసం కేటాయించారన్నారు అలాగే , 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను మరింతగా పెంచి రూ.17403 కోట్లను కేటాయించారని నాగార్జున వెల్లడించారు. ముఖ్యమంత్రి కేటాయించిన ఈ నిధుల్లో ఒక్క రుపాయి వృధా అయినా ఒప్పుకునేది లేదని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ పరిధిలోని సబ్‌ ప్లాన్‌ నిధులను పూర్తిగా వినియోగించుకొనేలా అంచనాలను రూపొందించుకోవాలని సూచించారు.

ఎస్సీ గ్రామాలు, వాడల్లో తాగునీరు, రోడ్లు, మురికి కాల్వలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. అయితే సబ్‌ ప్లాన్‌ నిధుల ద్వారా చేపట్టే పనుల వివరాలను నోడల్‌ ఏజెన్సీకి సమర్పించాలని, నోడల్‌ ఏజెన్సీ ఆమోదం పొందిన తర్వాతనే వాటికి సంబంధించిన పనులను చేపట్టాలని మంత్రి స్పష్టం చేసారు. నోడల్‌ ఏజెన్సీ ఆమోదం లేకుండా చేపట్టే పనులకు సబ్‌ ప్లాన్‌ నిధులను ఉపయోగించడం వల్ల ఆడిట్‌ అభ్యంతరాలు వస్తాయనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు అధికారిక లేఖలు రాయాలని సంక్షేమ అధికారులను నాగార్జున ఆదేశించారు. సబ్‌ నిధుల వినియోగంపై ప్రత్యేకంగా పంచాయితీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాలు, సాగునీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ), స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కు చెందిన ఉన్నతాధికారులతో మేరుగ నాగార్జున ప్రత్యేకంగా సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌, డైరెక్టర్‌ హర్షవర్థన్‌, స్వచ్చాంధ్రకార్పొరేషన్‌ ఎండీ సంపత్‌ కుమార్‌, పిఆర్‌ ఇఎన్సీ సుబ్బారెడ్డి తో పాటు-గా పలువురు అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement