Tuesday, November 26, 2024

టీఎస్‌ ఫుడ్స్‌లో సౌర విద్యుత్‌ వినియోగం.. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సంస్థలో ఖర్చులను తగ్గించడంతోపాటు కాలుష్యాన్ని కూడా తగ్గించాలనే లక్ష్యం తో సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలంగాణ ఫుడ్స్‌(టీఎస్‌ ఫుడ్స్‌) ఛైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. శనివారం టీఎస్‌ రెడ్కో ఛైర్మన్‌ వై. సతీష్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌ నాచారంలోని టీఎస్‌ ఫుడ్స్‌ ఫ్యాక్టరీని రాజీవ్‌సాగర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ సాగర్‌ మాట్లాడుతూ సంస్థలో ఇప్పుడున్న ప్లాంట్‌కు అదనంగా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున విద్యుత్‌ బిల్లులు పెరిగి నెలకు రూ.28 లక్షల దాకా ఖర్చవనున్నట్లు తెలిపారు. అయితే సంస్థలో సౌర విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తే టీఎస్‌ ఫుడ్స్‌ విద్యుత్‌ ఖర్చులు దాదాపు 50శాతం తగ్గుతాయన్నారు. ఆదా అయిన డబ్బులను సంస్థ అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.

సౌర విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సౌర ఫలకాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ రెడ్కో చైర్మన్‌ సతీష్‌రెడ్డిని టీఎస్‌ ఫుడ్స్‌ ఫ్యాక్టరీకి ఆహ్వానించి ఆయనతో కలిసి ఫ్యాక్టరీని సందర్శించినట్లు తెలిపారు. సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుపై దానికి సంబంధించిన ఏర్పాట్లపై సతీష్‌రెడ్డితో చర్చించినట్లు రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. సందర్శన అనంతరం సతీష్‌రెడ్డిని రాజీవ్‌సాగర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ జీఎం విజయలక్ష్మీ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కృష్ణవేణి, వర్క్స్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement