ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమన్న భారత ప్రధాని మోడీ వ్యాఖ్యలను స్వాగతిస్తామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ శుక్రవారం టెలిఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అమెరికా స్పందించింది. ”ప్రధాని మోడీ మాటలను మేం పరిగణనలోకి తీసుకుంటాం. ఆయన సూచనలు ఆచరణలో అమలైనపుడు మేం వాటిని స్వాగతిస్తాం. రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ, యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు మేం మాత్రం మిత్రదేశాలతో సమన్వయం కొనసాగిస్తాం” అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
యుద్ధాన్ని ముగించాలంటూ మోడీ ఇచ్చిన పిలుపుపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఇక రష్యా-ఉక్రయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారత పాత్ర గురించి ప్రశ్నించగా.. ”యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు పాటుపడాలనే ఆసక్తి ఉన్న ఏ దేశమైనా.. ఉక్రెయిన్ మిత్ర దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది” అని పటేల్ పేర్కొన్నారు. కాగా.. రష్యా, భారత్ దేశాధినేతల మధ్య ఈ ఏడాది ఐదు సార్లు టెలిఫోన్ చర్చలు జరిగాయి.