Friday, November 22, 2024

US Open | అల్కరాజ్‌కు షాక్‌.. మెద్వెదెవ్‌ సంచలన విజయం!

ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రష్యా క్రీడాకారుడు, మూడో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ అదరగొట్టాడు. శనివారం ఉదయమిక్కడ జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రష్యా అటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌, వరల్డ్‌ నెంబర్‌ వన్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌కు షాకిచ్చాడు. హోరాహోరీగా సాగిన పోరులో మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ అద్భుత ఆటతీరుతో స్పెయిన్‌ యువకెరటం అల్కరాజ్‌ జోరుకు అడ్డుకట్ట వేశాడు. 7-6(3), 6-1, 3-6, 6-3తో 27ఏళ్ల మెద్వెదెవ్‌ జయకేతనం ఎగురవేశాడు. తద్వారా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొత్తంగా మెద్వెదెవ్‌కు ఇది ఐదో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. దాంతో అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్స్‌ చేరిన తొలి రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్‌ రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ ఆటతీరు మరోస్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదు. బలంగా కనిపించే అల్కరాజ్‌తో పోల్చితే బక్కపల్చగా ఉండే ఈ రష్యన్‌ ఆటగాడు పదునైన సర్వీసులతో ఆకట్టుకున్నాడు. బ్రేక్‌ పాయింట్లు గెలవడంలో ఒడుపు చూపించిన మెద్వెదెవ్‌ కీలక సమయాల్లో అల్కరాజ్‌ను నిలువరించి తొలి రెండు సెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అయితే మూడో సెట్‌లో అల్కరాజ్‌ పుంజుకుని ఆ సెట్‌ను 6-3తో చేజిక్కించుకున్నాడు. కానీ ఆ ఊపు తాత్కాలికమే అయింది. నాలుగో సెట్‌ను మెద్వెదెవ్‌ 6-3తో గెలుచుకుని, తద్వారా అల్కరాజ్‌కు కళ్లెం వేశాడు. ఇక సోమవారం జరిగే ఫైనల్లో మెద్వెదెవ్‌ నంబర్‌-2 సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అర్ధరాత్రి జరిగిన మరో సెమీస్‌లో జకోవిచ్‌ 6-3, 6-2, 7-6తో అమెరికా యువ ఆటగాడు బెన్‌ షెల్టన్‌పై అలవోకగా నెగ్గాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement