ఇంటర్వ్యూ మినహాయింపులు ఉన్న బీ1, బీ2 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి కోసం అదనపు స్లాట్స్ ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రకటించింది. బీ1, బీ2 ఇంటర్వ్యూ మినహాయింపు అపాయింట్‌మెంట్స్ కోసం వచ్చే నెలలో అదనపు స్లాట్స్ ప్రాంభిస్తామని తెలిపింది. ఈ స్లాట్స్‌ను ఢిల్లి, ముంబై, చెన్నయ్ అమెరికా ఎంబసీలో అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం బీ1, బీ2 వీసాల అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీలో 233 రోజులు, ముంబైలో 297 రోజులు, చెన్నయ్‌లో 171 రోజులు ఎదురు చూడాల్సి ఉంది.
ఇంటర్వ్యూ మినహాయింపు లేని బిజినెస్ వీసా బీ1, టూరిస్టు వీసా బీ2 పొందేందుకు ఎదురు చూసే సమయం మూడు సంవత్సరాలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బీ1, బీ2 వీసా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూసే సమయం సగటున 2 నెలల వరకు ఉందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్న వారు డ్రాప్ బాక్స్‌లో తమ అప్లికేషన్లను వేయాల్సి ఉంటుంది. వీటిని సాధ్యమైనంత త్వరగా జారీ చేసేందుకు అమెరికా స్టేట్ డిపార్‌్టమెంట్ అదనపు ఉద్యోగులను నియమిస్తోంది. అడ్మిషన్ సీజన్‌లో విద్యార్ధులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది.
వీరి తరువాత నైపుణ్యం ఉన్న ఉద్యోగులు, వర్కర్లకు, బీ1, బీ2 వీసాల రిపిటర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నాలుగు సంవత్సరాల లోపు గడువు ముగిసే అప్లికేషన్లకు ప్రస్తుతం ఇంటర్వ్యూ మినహాయింపు ఇస్తున్నారు. 2023లో కొవిడ్‌కు ముందున్న కాల పరిమితికి ఇది వస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.