గ్రేటర్ హైదరాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపట్టి.. అభివృద్ధి పరుస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతమని హైకోర్టు చీఫ్ జస్టి స్ సతీష్ చంద్ర శర్మ కొనియాడారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరంలోని కేబీఆర్ పార్క్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్క్ ఖాళీ స్థలంలో చీఫ్ జస్టీ స్ మర్రి మొక్కను నాటగా, జస్టి స్ నవీన్‌రావు నేరేడు మొక్కను, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ వేప మొక్కను నాటారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను గురించి, చీఫ్ జస్టిస్‌కు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్‌ఎం.డోబ్రియాల్ వివరించారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టి స్ పార్క్‌లో కొద్దిసేపు అతిథులతో కలిసి ఆయన వాకింగ్ చేశారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ అందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. హరిత తెలంగాణలక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతిఒక్కరూ మూడు పీ (పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటక్ట్ )లను విధిగా అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.