సివిల్ సర్వీసెస్-2024 మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 7 నుండి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల రూల్ నంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించగా… యూపీఎస్సీ డిసెంబర్ 9న ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 2,845 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు (వ్యక్తిత్వ పరీక్ష) అర్హత సాధించారు. కాగా, ఇంటర్వ్యూకు సంబంధించిన ఇ-సమన్ లెటర్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది.
ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులను వికలాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.