Monday, November 25, 2024

UPSC ఛైర్మ‌న్ మ‌నోజ్ సోనీ రాజీనామా …

ఆంధ్రప్రభ స్మార్ట్ – ఢిల్లీ – యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్‌ నెలలోనే బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్ వివాదం వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, ఈ వివాదంతో మనోజ్‌ సోనీ రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు పేర్కొన్నాయి. అయితే, దీన్ని ఇంకా ఆమోదించలేదని సదరు వర్గాలు తెలిపాయి. 2017లో యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యుడిగా చేరి గతేడాది మే నెలలో ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

- Advertisement -

2029 మే 15 వరకు ఆయన పదవీకాలం ఉంది. అయితే, ఛైర్మన్‌ పదవి చేపట్టడానికి ఆయన ముందునుంచి సుముఖంగా లేరని సమాచారం. తనను ఈ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని గతంలోనే ఓసారి అభ్యర్థించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని సోనీ కోరుకుంటున్నట్లు తెలిపాయి. యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి ముందు ఆయన గుజరాత్‌లోని డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వరుసగా రెండుసార్లు వీసీగా సేవలందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement