Friday, November 22, 2024

పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతలకు అప్ప‌ర్ భద్ర‌ అడ్డంకే..

ప్రభన్యూస్‌ : పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో.. తెలంగాణలోని పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జాతీయ హాదాను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. మరోవైపు పాలమూరు ప్రాజెక్టుకు రావాల్సిన కేంద్ర అనుమతుల విషయంలో కూడా తీవ్ర జాప్యం చేస్తోంది. చివరికి జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తీవ్ర ప్రభావం చూపించేలా నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు వెనువెంటనే అనుమతులు ఇవ్వడంతో పాటు జాతీయ హోదాను సైతం కట్టబెట్టింది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సిడబ్ల్యూసి) ఆమోదం తెలపడంతో పాటు కేంద్రం జాతీయ హోదా ప్రాజెక్టు కింద రూ.16 వేల కోట్లను ఇవ్వాలని కూడా నిర్ణయించడం గమనార్హం. క్రిష్ణ..తుంగభద్ర నదులపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎక్కువగా తుంగభద్ర నుంచి నీరు వస్తుంది. క్రిష్ణా నదిపై కర్ణాటకలో ఆలమట్టి..నారాయణపూర్‌ డ్యాంలను నిర్మించడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఇటీవల కాలంలో తుంగభద్ర నుంచి నీరు ఎక్కువగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తుగంభద్ర నదిపై కొత్తగా అప్పర్‌ భద్ర పేరిట కొత్త ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. మధ్య కర్ణాటకలోని చిత్రదుర్గ. దేవన్‌గిరి. తూమకూరు, చిక్మంగళూరు జిల్లాలో 2.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని అప్పర్‌ భద్ర ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

దాదాపు 30 టిఎంసిల నీటిని అప్పర్‌ భద్ర రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇక వేదావతి నదిపై వానివిలాస్‌ సాగర్‌ రిజర్వాయర్‌ కూడా కర్ణాటక నిర్మిస్తోంది. అప్పర్‌ భద్ర నుంచి వానివిలాస్‌ రిజర్వాయర్‌లోకి 2 టిఎంసిల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. అటు తుంగభద్ర.. ఇటు వేదావతి నదులపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న అనేక ఎత్తిపోతల పథకాలు.. తాగునీటి పథకాలకు నీరు లభించని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి నీటి కేటాయింపులు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు మంజూరు చేసిన అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సీడబ్ల్యూసికి తెలంగాణ లేఖ రాసింది. రెండో క్రిష్ణా నీటి వివాదాల ట్రిబ్యూనల్‌ (కెడబ్ల్యూడిటి..2) తీర్పు వచ్చే వరకు అనుమతులపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై.. ఫిర్యాదులపై అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు కేంద్ర జల సంఘం(సిడబ్ల్యూసి) నుంచి కనీస స్పందన ఉండడం లేదు. దక్షిణ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపించే అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి పోరుబాట సాగించారు. కేంద్రంతో పాటు సిడబ్ల్యూసిపై ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement