కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్ చెల్లింపులు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదిలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి డిజిటల్ పేమెంట్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ గేట్‌వే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఏ) పేమెంట్స్ రికార్డు నమోదు చేసింది. 2020తో పోలిస్తే గత నెలలో 11.6 శాతం పెరిగాయి. గత నెలలో మొత్తం రూ.5.47 లక్షల కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన సంస్థ లావాదేవీల్లోనే ఇది గరిష్ఠం.
గత మే నెలలో యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు రూ.4.91 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత నెలలో 280 కోట్ల లావాదేవీలు జరిగితే, మే నెలలో ప్రజలు 253 కోట్ల లావాదేవీలు నిర్వహించారని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. మే నెలతో పోలిస్తే జూన్‌లో యూపీఐ లావాదేవీలు 10 శాతం పెరిగాయి. పరిస్థితి ఇలాగే సాగితే భవిష్యత్‌లో యూపీఐ లావాదేవీలు నెలకు 300 కోట్ల మార్కు చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు 24 శాతం పీఎఫ్ కేంద్రమే భరిస్తుంది