Tuesday, November 26, 2024

2025 నాటికి దేశంలో 75 శాతానికి యూపీఐ చెల్లింపులు

న్యూఢిల్లి : మన దేశంలో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. లావాదేవీల ఫీజులు వసూలు చేయకపోవడంతో ప్రజలు తాము కొనుగోలు చేస్తున్న నిత్యావసరాల మొదలు గృహోకరణాలు, వ్యక్తుల నుంచి వ్యక్తులకు చెల్లింపులు యూపీఐ ద్వారానే చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్లతో పాటు, ఫీచర్‌ ఫోన్ల నుంచి కూడా యూపీఐ చెల్లింపులకు అవకాశం ఉండటంతో డిజిటల్‌ లావాదేవీలు భారీగానే పెరుగుతున్నాయి.
2025 నాటికి దేశంలో పర్సన్‌ టూ మర్చంట్‌ (పీ2ఎం) యూపీఐ చెల్లింపులు 75 శాతానికి చేరుకుంటాయని అంచనా. యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) చెల్లింపులపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం పర్సన్‌ టూ మర్చంట్‌ చెల్లింపులు 56.1 శాతంగా ఉన్నాయి.

గ్లోబల్‌ పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న వరల్డ్‌లైన్‌ ఇండియా డిజిటల్‌ పేమెంట్స్‌ ఫర్‌ హెచ్‌1 2023 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. 2023 సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇండియాలో యూపీఐ చెల్లింపులు 62 శాతం పెరిగిన ట్లు ఈ నివేదికలో వెల్లడించింది. ఈ పెరుగుదలతో అత్యధికంగా పర్సన్‌ టూ మర్చంట్‌ చెల్లింపులే ఉన్నాయని తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌ వరకు జరిగిన 51.91 బిలియన్‌ యూపీఐ లావాదేవీల్లో పీ2ఎం లావాదేవీలు 29.15 బిలియన్లుగా ఉన్నాయి. మొత్తం లావాదేవీల్లో ఇది 56.1 శాతంగా ఉంది. మిగిలి 22.75 లావాదేవీలు పర్సన్‌ టూ పర్సన్‌ (పీ2పీ)గా ఉన్నాయి.


లావాదేవీల విలువ పరంగా కూడా పర్సన్‌ టూ మర్చంట్‌ లావాదేవీలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో పర్సన్‌ టూ పర్సన్‌ లావాదేవీలు 41 శాతం పెరిగితే, పర్సన్‌ టూ మర్చంట్‌ లావాదేవీలు 119 శాతం పెరిగాయి. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు వసూలు చేయకపోవడంతో ఈ చెల్లింపులను అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఇద్దరూ ఈ చెల్లింపుల పట్ల మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది. దీని వల్ల ఇండియాలో పేమెంట్‌ మెకానిజం వియవంతంగా నడుస్తున్నట్లు తెలిపింది. వ్యాపారుల విషయానికి వస్తే చెల్లింపుల విషయంలో భద్రత, సరైన సమయంలో చెల్లింపులు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్సన్‌ టూ మర్చంట్‌ చెల్లింపులు పెరుగుతున్నందున యూపీఐ వీటిని మరింత విస్తృతం చేయనుంది. లావాదేవీలు జరిగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా యూపీఐ అన్ని చర్యలు తీసుకుంటోంది.


యూపీఐ చెల్లింపుల్లో సరాసరి టికెట్‌ సైజ్‌ (ఏటీఎస్‌) అంటే ఒక చెల్లింపు సరాసరి విలువ 2023 మొదటి ఆరు నెలల కాలంలో 1,604 రూపాయలుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది కొంత తక్కువగా ఉంది. గత సంవత్సరం ఇది 1,774 రూపాయలుగా ఉంది. ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలోనే లావాదేవీలు 62 శాతం పెరగడం అంటే, యూపీఐని వినియోగిస్తున్న వారి సంఖ్య గననీయంగా పెరగడమే. ఇందులో చిన్న మొత్తంలో చెల్లించే లావాదేవీలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు యూపీఐ వ్యాప్తి ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. యూపీఐ చెల్లింపులను అంగీకరించే చిన్న వ్యాపారులు కూడా పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది.
విలువ పరంగా చూస్తే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 47 శాతం పెరిగి, 83.17 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 56.59 లక్షల కోట్లుగా ఉన్నాయి. పర్సన్‌ టూ మర్చంట్‌ చెల్లింపులు పెరగడం మంచి సూచికని నివేదిక తెలిపింది.
ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం మూడు సంస్థల లావాదేవీల్లోనూ95.68 శాతం యూపీఐ లావాదేవీలే ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ సంవత్సరం జూన్‌ 30 నాటికి ఈ సంస్థల లావాదేవీల్లో వాల్యూమ్‌ పరంగా చూస్తే యూపీఐ చెల్లింపులు 93.65 శాతంగా ఉన్నాయి. ఈ మూడు సంస్థల మొత్తం లావాదేవీల్లో ఫోన్‌ పే వాటా గత సంవత్సరం 45.8 శాతంగా ఉంటే, ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఇది స్వల్పంగా పెరిగి 47.2 శాతంగా ఉంది. లావాదేవీల విలువ పరంగా చూస్తే ఫోన్‌ పే మార్కెట్‌ వాటా 48.8 శాతం నుంచి 49.8 శాతానికి పెరిగింది.
లావాదేవీల పరంగా చూస్తే గూగుల్‌ పే వాటా తగ్గిపోయింది. గత సంవత్సరం 34 శాతం ఉన్న వాటా ఈ సంవత్సరం 13.8 శాతానికి తగ్గింది. గూగుల్‌ పే వాటాను పేటీఎం సాధించింది. పేటీఎం లావాదేవీలు గత సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 14.7 శాతంగా ఉంటే, ఈ సంవత్సరం ఇదే కాలంలో 34.6 శాతానికి పెరిగింది. లావాదేవీల విలువ పరంగా చూసతే గూగుల్‌ పే మార్కెట్‌ వాటా గత సంవత్సరం 34.6 శాతం ఉంటే, ఈ సంవత్సరం అది 10.9 శాతానికి చేరింది.

- Advertisement -
యూపీఐ ద్వారా జరిగిన చెల్లింపుల్లో అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిలిచింది. 46.3 బిలియన్‌ లావాదేవీలు హెచ్‌డీఎఫ్‌సీకి చెందినవే ఉన్నాయి. దీని తరువాత స్థానంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిలిచింది. ఈ బ్యాంక్‌కు సంబంధించి 34 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియావి 32.4 బిలియన్ల లావాదేవీలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement