Saturday, November 23, 2024

పది లక్షల కోట్లు దాటిన యూపీఐ చెల్లింపులు.. 657 కోట్లు దాటిన లావాదేవీలు

యూనిఫైయిడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులు రికార్డ్‌ సృష్టించాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు నెలలో రికార్డ్‌ స్థాయిలో వినియోగదారులు 657 కోట్ల లావాదేవీలు నిర్వహించారు. వీటి ద్వారా 10.73 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. జులైలో జరిగిన 629 కోట్ల లావాదేవీలతో పోల్చితే ఇది 4.5 శాతం ఎక్కువ. విలువలో చూస్తే జులైలో 10.63 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇది ఆగస్టులో 0.95 శాతం ఎక్కువ చెల్లింపులు జరిగాయి. యూపీఐ చెల్లింపులు ప్రారంభమైన తరువాత ఈ సంవత్సరం జూన్‌లో మొదటిసారి 600 కోట్ల లావాదేవీల మైలురాయిని అధిగమించింది.

అదే సమయంలో ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానం (ఏఈపీఎస్‌) ద్వారా జరిగే చెల్లింపులు మొత్తం తగ్గాయి. ఆగస్టులో ఈ విధానంలో 10.6 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. ఇది జులైలో 11 కోట్లు, జూన్‌లో 12.1 కోట్లు లావాదేవీలు జరిగాయి. ఈ విధానంలో చెల్లింపులు కూడా 27,186 కోట్ల మేర జరిగాయి.

భారీగా పెరిగిన లావాదేవీలు

గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే యూపీఐ లావాదేవీలు, చెల్లింపులు భారీగా పెరిగాయి. లావాదేవీలు 84.6 శాతం, విలువ 67.9 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు 4,481 కోట్లు, లావాదేవీల విలువ 77.9 లక్షల కోట్ల రూపాయలు. 2002లో మొత్తం యూపీఐ లావాదేవీలు 3,026, వీటి ద్వారా జరిగిన చెల్లింపులు 51.7 లక్షల రూపాయలు. ఇటీవల ఆర్బీఐ యూపీఐ చెల్లింపులపై రుసుం వసూలు చేయాలని ప్రతిపాదించింది. దీనిపై పబ్లిక్‌ అభిప్రాయాలను కోరుతూ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ప్రజలు డిజిటల్‌ చెల్లింపులు చేయడం బాగుందని, దీనిపై ఎలాంటి రుసుం వసూలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇతర డిజిటల్‌ చెల్లింపులుపై కొంత మొత్తాన్ని ఛార్జీగా వసూలు చేస్తున్నారు. అయితే 2020 జనవరిలో యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రుసుం వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్లే చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఛార్జీ వసూలు చేస్తే మళ్లిd ప్రజలు నగదు లావాదేవీలపైపు మొగ్గు చూపుతారని ఆర్బీఐ చర్చ పత్రం విడుదల చేసిన సందర్భంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement