Saturday, November 23, 2024

అప్ డేటేడ్ క్రైమ్స్.. సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : హైదరాబాద్‌తో పాటు అనేక నగరాల్లో సైబర్‌నేరాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అవకాశం వచ్చినా వ‌ద‌ల‌కుండా సైబర్‌ నేరగాళ్లు నేరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అమాయకులను ఎలా బురిడీ కొట్టించాలనే లక్ష్యంతో ప్రజలు ఎలా అయితే సులభంగా నమ్ముతారనే దానిపై అధ్యయనం చేసి మరీ నేరాలకు తెరలేపుతున్నారు. ప్రధానంగా ప్రజలు నిత్యం వినియోగించే వాటినే ఆధారంగా చేసుకుని.. నమ్మించి వారి ఖాతాల్లో నుంచి నగదును లూటీ చేస్తున్నారు. ఇలాంటి నేరాలపై అవగాహన అంతంత మాత్రంగానే ఉండటంతో నగరం కేంద్రంగా ప్రతిరోజు సైబర్‌ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

కరెంటు బిల్లు చెల్లించలేదంటూ మెసేజ్‌లు..

మేము కరెంటు ఆఫీసు నుంచి మెసేజ్‌ చేస్తున్నాం. మీ సర్వీసు నెంబర్‌పై కరెంటు బిల్లు చెల్లించలేదు. 24 గంటల్లోగా కరెంటు బిల్లును చెల్లించకపోతే, మీ కరెంట్‌ను కట్‌ చేస్తాం. కరెంటు బిల్లును చెల్లించేందుకు కింద నెంబర్‌కు వెంటనే కాల్‌ చేయడంటూ సైబర్‌ నేరగాళ్లు నెంబర్‌ను ఇస్తున్నారు. ఆ మెసేజ్‌ నిజంగానే కరెంటు ఆఫీసు నుంచి వచ్చిందేమోనుకుని, నమ్మే అమాయక జనం వెంటనే మెసేజ్‌లో సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన నెంబర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు మాట్లాడుతూ మీ పేమెంట్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. వెంటనే చెల్లించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం మీ మొబైల్‌ ఫోన్‌లో ఎనీ డెస్క్‌, లేదా టీమ్‌ వ్యూయర్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తాము చెప్పినట్లు చేయాలని కోరుతున్నారు. ఇది నిజమేనని నమ్ముతున్న కొందరు అమాయక వినియోగదారులు, వారు చెప్పినట్లు చేసి తమ ఖాతాల్లో నుంచి డబ్బులను పొగొట్టుకుంటున్నారు. ఇలా అనేకమంది బాధితులు ఇప్పటికే సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఇలాంటి మెసేజ్‌లకు సంబంధించి, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన విద్యుత్‌ శాఖ అధికారులు, పోలీసులు ముందస్తుగా అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో, అనేక మంది అమాయకులు బాధితులుగా మారి డబ్బులను పొగొట్టుకున్నారు.

జొమాటో డెలివరీ క్యాన్సిల్‌ పేరుతో మోసం..

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటికి ఆహారం తెప్పించుకునే పద్ధతి పెరిగిపోయింది. అనేకమంది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకుంటూ, ఇంటి వద్దకే నచ్చిన టిఫిన్స్‌, బిర్యానీలు, అనేక రకాల వైరెటీ ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. అయితే దీనిని అవకాశంగా మార్చుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు, జొమాటో, స్విగ్గి పేర్లతో మోసాలకు తెరలేపారు. మీరు ఫుడ్‌ని ఆర్డర్‌ చేశారా అని అనేక మందికి కాల్‌ చేస్తుంటారు. మేము చేయలేదని చెప్పగానే, మీ పేరుపై ఆర్డర్‌ బుక్‌ అయింది. దానిని క్యాన్సిల్‌ చేయాలంటే ఖచ్చితంగా మేము పంపే ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. దీంతో అది నిజమేనని నమ్ముతున్న బాధితులు, వెంటనే హడావిడిలో వారికి వచ్చిన ఓటీపీని సైబర్‌ నేరగాళ్లకు చెప్పడంతో ఆ ఓటీపీ వివరాలను ఎంటర్ చేసుకుని, బాధితుడి ఖాతాలో ఉన్న డబ్బును సైబర్‌ నేరగాళ్లు వెంటనే ఖాళీ చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు సైబర్‌ నేరగాళ్లు అమాయకులకు గాలం వేస్తూ, బురిడీ కొట్టిస్తూ అమాయకుల ఖాతాల్లోంచి నగదును తమ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. వీటిపై స్విగ్గి, జొమాటో సంస్థలు స్పందించకుండా, ప్రజలకు, వినియోగదారులకు అవగాహన కల్పించకుండా ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ముందుగానే అవగాహన కల్పిస్తే, ఇలాంటి నేరాలు జరగవని అంటున్నారు.

- Advertisement -

ఇవి మర్చిపోకండి..

సైబర్‌ నేరగాళ్లు తెలుగులో కూడా మాట్లాడుతారు. స్థానికంగా ఉంటే గుర్తు పడతారని, ఇక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి, సైబర్‌ నేరగాళ్లతో జత కడుతున్నారు. కరెంటు బిల్లుకు సంబంధించిన ఏదైనా చెల్లింపులు, లేదా ఏదైనా సందేహం ఉంటే వెంటనే స్థానిక విద్యుత్‌ కార్యాలయానికి వెళ్లి అడగాలి. నేరుగా కలవకుండా కేవలం ఫోన్‌లో పరిచయమైన వ్యక్తులకు ఎట్టి పరిస్థి తుల్లో నగదును అకౌంట్‌లో డిపాజిట్‌ చేయకూడదు. సైబర్‌ నేరగాళ్లు అన్ని భాషల్లో మాట్లాడుతారనే విషయం గమనించాలి. సెల్‌ఫోన్‌లకు వచ్చే బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల్లో వచ్చే లింక్‌లను బ్రౌజ్‌ చేయవద్దు. వాటిని వెంటనే డిలేట్ చేయాలి. ఎలాంటి అనుమానం వచ్చినా డయల్‌ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి. ఎవరైనా తమ పిల్లలు సైబర్‌ నేరాల బారిన పడితే, పోలీసులను ఆశ్రయించండి.3

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement