గ్రామపంచాయితీ బిల్లుల చెక్కులపై ఉప సర్పంచ్ లు సంతకాలు చేయకుండా పదే పదే ఇబ్బంది పెడితే వారి స్థానంలో వార్డు సబ్యుల్లో ఒకరికి ఆ అధికారం అప్పగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ , కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల ఉప సర్పంచ్ లు సంతకం పెట్టకుండా సర్పంచ్ లను ఇబ్బందిపెడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఫలితంగా సిబ్బందికి వేతనాలు, ఇతర చెల్లింపులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదనలు వినిపించాయి.
ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమీక్షలో, ప్రజా ప్రతినిధులు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పంచాయితీ రాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. చెక్కులపై సంతకాలు చేయకుండా, ఉప సర్పంచ్ పదే పదే ఇబ్బంది కలిగిస్తే గ్రామసభని నిర్వహించి తీర్మానం చేయాలని, ఉప సర్పంచ్ స్థానంలో వార్డ్ సభ్యుల్లో ఒకరికి సంతకం చేసే అధికారం ఇవ్వాలని తెలిపింది. ఆ తీర్మానానికి కలెక్టర్ అనుమతి తప్పని సరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులకు మార్గదర్శకాలను జారీ చేయాలని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..