ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు యూపీ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి ప్రకటించారు.
ఘటనలో గాయపడిన వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రేపు (బుధవారం) ఘటనా ప్రాంతాన్ని సందర్శించనున్నారని ఆయన చెప్పారు. హత్రాస్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగింది.
రతిభాన్‌పూర్‌లో శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే భక్తులు ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 107 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.