జనాభా నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇద్దరు పిల్లల విధానాన్ని ఈ కొత్త విధానం ప్రోత్సహిస్తోంది. దీనిని ఉల్లంఘించిన వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. అంతేకాదు దీనిని ప్రభుత్వ ఉద్యోగాలు, సబ్సిడీలకు కూడా వర్తింపజేయనున్నారు. పెరిగిపోతున్న జనాభా రాష్ట్ర, దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పేదరికానికి జనాభా పెరుగుదల కూడా కారణం. ఈ కొత్త జనాభా విధానం 2021-2030లో ప్రతి కమ్యూనిటీని పరిగణనలోకి తీసుకున్నట్లు యోగి చెప్పారు. ఈ కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030కిగాను కొత్త జనాభా విధానాన్ని ప్రకటించారు. జననాల రేటును 2026లోపు వెయ్యికి 2.1కి, 2030లోపు 1.9కి తీసుకురావాలని అందులో లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం యూపీ జననాల రేటు 2.7గా ఉంది. రాష్ట్రంలో జనాభాను నియంత్రించాలంటే కచ్చితంగా ఇద్దరు పిల్లల మధ్య ఎడం పెంచాలని కొత్త విధాన ప్రకటన సందర్భంగా సీఎం యోగి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు