ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి : రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో చేతికి వచ్చిన పంటలు దెబ్బతింటాయనే ఆందోళన నెలకొంది. వేసవి కాలంలో అకాల వర్షాలు రైతులను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే విడతల వారీగా కురిసిన అకాల వర్షాలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 33 శాతానికి పైగానే పంటలు వర్షార్పణమయ్యాయి. తొలి విడత కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది.ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అందించనున్నారు. వాటిని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రెండవ విడత వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. మూడవ విడతకు సంబంధించి అధికారులు క్షేత్ర స్థాయిలో నష్టానికి సంబంధించిన లెక్కలు వేస్తున్నారు.
వ్యవసాయం గాలిలో దీపంలా తయారైంది..
ఒకసారి అనావృష్టితో పంటలు దెబ్బతింటుండగా మరోసారి అతివృష్టితో పంట నష్టం జరుగుతోంది…మొత్తం మీద
ఏదో ఒక కారణంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈసారి మాత్రం పరిస్థితులు రివర్స్ అయ్యాయి. వాస్తవానికి వేసవి కాలంలో ఎండలకు పంటలు ఎండిపోవడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఎండల మాట పక్కకు పెడితే వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. వేసవి కాలంలో వడగండ్ల వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోంది. కాకపోతే కొన్ని రోజులపాటు కొన్ని ప్రాంతాల్లోనే అకాల వర్షాలు కురిసేవి. కానీ ఈసారి మాత్రం అన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తోంది. విడతల వారీగా రైతులను వర్షాలు దెబ్బతీస్తున్నాయి. పంటలు చేతికి వచ్చే దశలో వర్షాలు కురుస్తుండటంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో వరి కోతలు పూర్తి అయ్యాయి. ఆలస్యంగా వరినాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పొట్ట దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో కోతలు కోసే పరిస్థితులు. ఇలాంటి తరుణంలో వర్షాలు కురుస్తుండటంతో వరిపంట నేలకొరుగుతోంది. పొట్ట దశలో ఉండటంతో పంట వర్షార్పణమవుతోంది…ఇంటిల్లిపాది కాయకష్టం చేసిన రైతులకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. మబ్బులు వస్తేచాలు రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. విడతల వారీగా వర్షాలు రైతులను ఆర్థికంగా నష్టాలపాల చేస్తోంది.
జోరుగా వర్షాలు..
వేసవికాలంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విడతల వారీగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం గాలిలో దీపంలా తయారైంది. వేసవికాలంలో విడతల వారీగా వర్షాలు కురుస్తుండటంతో పంటలు నీళ్లపాలవుతున్నాయి. జిల్లాలో విడతల వారీగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మార్చి మాసంలో 5.7 మిల్లిdమీటర్లు సాధారణ వర్ణపాతం కాగా 33.9 మిల్లిdమీటర్ల వర్షం కురిసింది. ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఆ మాసంలో 14 మిల్లిdమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 61.6 మిల్లిdమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుత మే మాసానికి సంంబధించి 28.4 మిల్లిdమీటర్లు సాధారణ వర్షపాతం కాగా ఇప్పటికే 30.9 మిల్లిdమీటర్ల వర్షం కురిసింది. జూన్ మాసం నుండి ఇప్పటివరకు 668.6 మిల్లి మీటర్లు సాధారణ వర్షపాతం కాగా 1097 మిల్లిdమీటర్ల వర్షం కురిసింది. ఈ మాసంలో మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.
రెండు జిల్లాల్లో 11,500వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో పంటలు వర్షం పాలయ్యాయి. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పంట నష్టం అంచనా పెరిగే అవకాశం ఉంది. రెండు జిల్లాల పరిధిలో 11,500వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 33 శాతానికిపైగానే పంటలు దెబ్బతినడంతో అధికారులు పంట నష్టం అంచనాలు వేశారు. రెండు జిల్లాల్లో 8వేల మంది రైతులు నష్టపోయారు. వికారాబాద్ జిల్లాలో విడతల వారీగా కురిసిన వర్షానికి 8055ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 5595మంది రైతులు నష్టపోయారు. రంగారెడ్డిజిల్లాలో 3371 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 2344మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. వరిపంటతోపాటు పండ్లు, పూలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
తొలి విడత పరిహారం..
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తొలి విడత కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10వేల చొప్పున మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో మంచాల, యాచారం మండలాల పరిధిలో ఎక్కువ నష్టం జరిగింది. 947.3 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 619మంది రైతులు నష్టపోయారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం కింద రూ. 94లక్షలు మంజూరు చేసింది. వీటిని ట్రెజరీలో జమ చేశారు. ట్రెజరీనుండి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. రెండవ విడతకు సంబంధించి జిల్లాలో ఏకంగా 1445 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 1194మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. వీరికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. మూడవ విడతలో జిల్లాలో ఇప్పటికే 979 ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. ఇందులో 531మంది రైతులు నష్టపోయారు. దీనికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనాలు వేస్తున్నారు..పూర్తిసమాచారం రాగానే ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి తెలిపారు.