న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ బోడపాటి శేజల్ తనకు న్యాయం జరిగే వరకు దేశ రాజధానిలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు. సోమవారం మధ్యాహ్నం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరుల వేధింపులు, తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్లనే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గం చిన్నయ్యను అరెస్టు చేసే వరకు ఢిల్లీలోనే ఉండి న్యాయపోరాటం చేస్తానని ఆమె చెప్పారు.
తననే కాదు ఎంతో మంది మహిళలను ఎమ్మెల్యే చిన్నయ్య లైంగికంగా వేధించారని శేజల్ అన్నారు. పనులు చేయించుకోవాలంటే అమ్మాయిలను పంపాలంటూ పంపిన వాట్సాప్ చాట్ మెసేజులు కూడా తమ దగ్గరున్నాయని చెప్పారు. అధికారబలంతో తన అక్రమాలు బయటకురాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. బెల్లంపల్లిలో డైరీ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం వెళ్తే వ్యాపారంలో తనకు వాటా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, ఆ మేరకు ఎమ్మెల్యే సూచించిన ముగ్గురికి షేర్లు కూడా ఇచ్చామని చెప్పారు. అయితే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి తన స్థలంగా చెబుతూ ఓ స్థలాన్ని చూపించారని, తీరా భూమి పూజ చేసిన తర్వాత అది ప్రభుత్వ భూమి అని తేలిందని అన్నారు.
ఈ మోసం గురించి ప్రశ్నించినప్పటి నుంచి కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తాను అసలు వాట్సాప్ వాడనని చెబుతున్న దుర్గం చిన్నయ్యకు వాట్సాప్ ఫోన్ కాల్ చేస్తే అసలు నిజం బయటపడుతుందని అన్నారు. తమ వెనుక ఏ పార్టీ లేదని, తనకు జరిగిన అన్యాయం, ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకుని బీజేపీ మహిళా మోర్చా నేతలు వచ్చారని ఆమె వివరించారు.
ఆస్పత్రిలో బీజేపీ నేతల పరామర్శ
బాధిత మహిళ శేజల్ డిశ్చార్జి అవడానికి కాస్త ముందు బీజేపీ సెంట్రల్ కోఆర్డినేటర్ (తెలంగాణ) నూనె బాల్రాజ్ నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు గీతామూర్తి, ఉపాధ్యక్షురాలు డా. మాలతి ఇప్పా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఆమెను పరామర్శిస్తున్న సమయంలోనే వైద్యులు డిశ్చార్జికి ఏర్పాట్లు చేశారు. అనంతరం శేజల్ను తెలంగాణ భవన్కు తీసుకొచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఆధారాలతో సహా చూపిస్తున్నప్పటికీ తెలంగాణ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. శేజల్కు అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని తెలిపారు.