న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న మణిపూర్ ఘటనలపై మంగళవారం కూడా బీఆర్‌ఎస్ పట్టు వీడలేదు-కేంద్రం మెట్టు దిగలేదు. పార్లమెంట్‌లో ఇదే అంశంపై రగడ చెలరేగింది. బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో, అటు రాజ్యసభలో కె.కేశవరావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మణిపూర్ ఘటనలపై చర్చ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఎంపీలు డిమాండ చేశారు.
ఇరు సభల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్ తీర్మానాన్ని అంగీకరించకుండా, చర్చ జరపకుండా సభను పదే పదే వాయిదా వేయడంపై ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా పోయిందని ఆక్షేపించారు.
ఆప్ ఎంపీకి సంఘీభావం
రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బీఆర్‌ఎస్ ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆప్ ఎంపీలతో పాటు కూర్చుని మద్దతు తెలిపారు. సంజయ్ సింగ్‌పై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో ఎంపీలు కేకే, నామ నాగేశ్వరరావుతో పాటు సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారధి రెడ్డి, దామోదర్ రావు , ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రవిచంద్ర, మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.