స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటును ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకించడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తప్పుబట్టారు. నెతన్యాహు వైఖరి ప్రపంచ శాంతికి ముప్పు అని వ్యాఖ్యానించారు. నెతన్యాహు తన వైఖరి మార్చుకోకపోతే.. ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్న ఇరు దేశాల వివాదం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందన్నారు. చాలాచోట్ల తీవ్రవాద సంస్థలు పుట్టుకు రావొచ్చని వ్యాఖ్యానించారు.
సుధీర్ఘ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశ ఏర్పాటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని ఎవరు అంగీకరించకపోయినా ఆ నిర్ణయాన్ని తిరస్కరించాల్సిందే. ఎలాంటి స్వతంత్రం, హక్కులు, గౌరవం లేకుండా అంతమంది పాలస్తీనా ప్రజలు ఒక ప్రాంతంలో ఉండటం అసలు ఊహించలేం’ అని గుటెరస్ అన్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హమాస్ మిలిటెంట్‌లు-ఇజ్రాయెల్ సేనల ఘర్షణలు ప్రాంతీయంగా అల్లకల్లోలానికి దారితీస్తాయనే అంచనాలు నిజమవుతున్నాయని గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు ఇటీవల లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్, పాకిస్థాన్ దేశాల్లో జరిగిన దాడులను ఆయన ఉదహరించారు. ఇరు పక్షాలు వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.
తిరస్కరించిన ఇజ్రాయెల్ రాయబారి
అయితే, గుటెరస్ కాల్పుల విరమణ పిలుపును ఐరాసలోని ఇజ్రాయెల్ రాయబారి గిలద్ ఎర్డన్ తిరస్కరించారు. 2023 అక్టోబర్ 7న తమపై అత్యంత క్రూరంగా దాడి చేసిన హమాస్‌పై పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గినా హమాస్ మిలిటెంట్లు మరింత రెచ్చిపోయి దాడులకు తెగబడతారన్నారు. ఈ వివాదానికి మూలం ఇరాన్‌లోనే ఉందని, హమాస్, హెజ్‌బొల్లా, హౌతీలకు ఆ దేశమే ఆయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపించారు.