Sunday, November 17, 2024

వెంటాడుతున్న అకాల వర్షాలు.. రైతు కంట కన్నీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రకృతి ప్రకోపానికి రైతు బలవుతూనే ఉన్నాడు. విత్తనం నాటిన నాటి నుంచి అనేక రకాల శ్రమకోర్చి సాగు చేస్తే పంట చేతికందే సమయానికి అకాల వర్షాలు రైతులను కోలుకోలేకుండా దెబ్బతీస్తున్నాయి. మండు వేసవిలోనూ అకాల వర్షాలు, వడగళ్లు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఇప్పటికే వారం రోజులుగా కురిసిన అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగళ్ల వానలకు వరి ధాన్యం చేలల్లోనే నేలరాలింది. చివరకు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డులకు తెచ్చిన ధాన్యాన్ని కూడా అకాల వర్షాలు వదలడం లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టేందుకు ప్రకృతి సహకరించకపోవడంతో కళ్లముందే ధాన్యం మొలకెత్తుతోందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

వర్షాల నుంచి నుంచి పంట రాశులను కాపాడుకోవడం రైతులకు గగనమవుతోంది. ఆదివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వడగళ్లవానలు కురిశాయి. పంటలను, కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన, రాశిచేసిన ధాన్యాన్ని తడిపి ముద్దచేశాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లాలోని సిరికొండలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సుల్తాన్‌పెట్టులో వడగళ్ల వాన కురిసింది. సిరికొండ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు మార్కెట్‌కు తరలించిన ధాన్యం కూడా తడిసిపోయింది.

Unseasonal rains spell doom for farmers in Telangana

- Advertisement -

పలు ప్రాంతాల్లోని మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల కిందకు వరదనీరు చేరి వడ్లు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మార్కెట్‌కు పెద్ద ఎత్తున ధాన్యం రాగా కనీసం రాశులపై కప్పేందుకు టార్పలిన్‌ షీట్లు కూడా సమకూర్చకపోవడంతో ధాన్యం అంతా వరదపాల వుతోంది. ఈ ఒక్క వ్యవసాయ మార్కెట్‌లోనే దాదాపు 500 క్వింటాళ్ల వడ్లు తడవగా, 200 క్వింటాళ్ల వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానకు వరిచేలు నేలకొరిగాయి. కోతకొచ్చిన వరి చేల్లో వడ్లు నేలరాలాయి. పంట కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కూడా వర్షార్పణమయింది. వికారాబాద్‌ జిల్లాలో వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో అకాల వర్షానికి పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గనుల్లో భారీ వరద నీరు నిల్వ కావడంతో బొగ్గు ఉత్పత్తి ని లిచిపోయింది. జనగామ, హన్మకొండ, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

అదేవిధంగా హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, జగద్డిరిగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌పీ, ప్రగతినగర్‌, బాచుపల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం…

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఈదరుగాలులతో వర్షం కురవగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు ధాన్యం రాశులపై పట్టాలు కప్పినా వర్షం ధాటికి పరదాలు కొట్టుకుపోయి ధాన్యం తడిసింది. రైతులు బోరున విలపిస్తున్నారు.

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి…

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపురం మండలం వెన్నంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతిచెందాడు. రోజూ మాదిరిగానే జంగం కొమురయ్య జీవాలను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లాడు. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం వర్షం, పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వెంట ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది.

రెండు రోజులపాటు పిడుగుల వాన…

రాగల రెండు రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి కారణంగా మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement