Saturday, November 23, 2024

ఢిల్లీ గడ్డపై సమైక్యతా దినోత్సవం.. తెలంగాణ భవన్‌లో ఘనంగా వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన సందర్భాన్ని జాతీయ సమైక్యతా వజ్రోత్సవ దినోత్సవాలుగా నిర్వహించాలన్న పిలుపుమేరకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డా. మంద జగన్నాదం, కె. ఎం సాహ్నిలు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమంలో తొలుత భవన్ ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమర వీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మందా జగన్నాదం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని, రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం రాకముందు ఇప్పుడున్నట్టుగా దేశంలో పాలన ఉండేది కాదని, బ్రిటీష్‌వారి ప్రత్యక్ష పాలనలో కొంత భాగం, స్వదేశీ రాజుల పాలనలో మరికొంత భాగం ఉండేవని చెప్పారు. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మతాతీత దేశభక్తి భావన, దేశానికి తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల ఈ సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమై నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని అన్నారు.

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయని, 75 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు. ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత, దేశం అనుసరిస్తున్న జీవనసూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి అని మంద జగన్నాథం వ్యాఖ్యానించారు. ఆనాడు తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర శక్తులు కట్రలు చేస్తున్నాయని మందా జగన్నాథం ఆరోపించారు. సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ, జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement