Friday, November 22, 2024

Delhi: కలుపుకోండి, పార్టీ బలం పెంచండి.. తెలంగాణ లీడ‌ర్ల‌కు ప్రియాంక దిశానిర్దేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో పార్టీని నేతలను సంఘటితం చేయాలని, కలిసికట్టుగా పని చేయాలని ప్రియాంకగాంధీ రాష్ట్ర సహ ఇంఛార్జులకు దిశానిర్దేశం చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఆమె తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కో-ఇంచార్జులు బోసురాజు తన సహచర ఇంచార్జులు నదీం జావెద్, రోహిత్ చౌదరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గంటకు పైగా మనుగోడు సహా టీపీసీసీ అంతర్గత విబేధాలపై చర్చించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రియాంక గాంధీ వారితో చర్చించారు. అనేక అంశాలను వారినడిగి తెలుసుకున్నారు.

భేటీ అనంతరం బోసురాజు మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా ప్రియాంక గాంధీ టీపీసీసీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారని తెలిపారు. వాటిలో నేతలిచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా తమకు కొన్ని సూచనలు చేశారని చెప్పారు. మునుగోడుతో పాటు 119 అసెంబ్లీ నియోజకవర్గాల గురించి కూడా సమావేశంలో చర్చ జరిగిందని వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల గురించి కూడా ప్రియాంక గాంధీ మాట్లాడారని బోసురాజు అన్నారు. మునుగోడు అభ్యర్థి అంశంపై హైదరాబాద్‌లో బుధవారం సమావేశం జరిగిందని వెల్లడించారు. మునుగోడు అభ్యర్థిని ప్రతిపాదించేది హైదరాబాద్‌లోనేనని బోసురాజు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement