Friday, November 22, 2024

Delhi: బంగ్లా ప్రధాని హసీనాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పర్యాటక రంగం సహా పలు అంశాల‌పై చ‌ర్చ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్ రెడ్డి బుధవారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈశాన్య భారతం-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకోవడం ద్వారా ఇరుదేశాల్లో వివిధ అంశాల్లో సానుకూల ఫలితాలకు ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. బార్డర్ హాట్స్, ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్స్, ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యల ద్వారా సరిహద్దు వాణిజ్యానికి మరింత ఊతం లభిస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దృష్టికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇరుదేశాల మధ్య వివిధ అనుసంధాన మార్గాలను (మల్టీ-మోడల్ కనెక్టివిటీ) అమలుచేయాల్సిన అవసరం ఉందని అప్పుడే ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

విద్యుత్, వ్యవసాయం, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ రేవుల సహకారం, పర్యాటకం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించారు. దీనికి సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణను పరిశీలించవలసిందిగా బంగ్లాదేశ్ ప్రధానిని కిషన్ రెడ్డి కోరారు. అనంతరం, శ్రీమతి షేక్ హసీనా సమక్షంలో ఇరుదేశాల పారిశ్రామిక వేత్తల సదస్సు (సీఈవో కాన్ఫరెన్స్)ను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈశాన్య భారతం అభివృద్ధి కోసం శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇరుదేశాల మధ్య అనుసంధానత తదితర అంశాలకు పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు.

విశ్రాంతి పర్యాటకం, వైద్య పర్యాటకం, విద్య, సాంస్కృతిక మార్పిడి తదతర అంశాల్లో ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చన్న కిషన్ రెడ్డి.. ఈశాన్య భారతంలోని విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఈవోలకు సూచించారు. ఈమేరకు పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన కిషన్ రెడ్డి, తమ ప్రభుత్వం తరఫున అన్ని అంశాల్లోనూ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాల నేతృత్వంలో ద్వైపాక్షిక సత్సంబంధాల స్వర్ణయుగం ప్రారంభమైందని, దీన్ని వాణిజ్యవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement