న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్, కవితే చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఢిల్లీకి వచ్చి మద్యం వ్యాపారం చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు ఇచ్చి, అక్రమంగా సొమ్ము చేసుకుని, ఆపై దర్యాప్తు మొదలుపెట్టగానే తెలంగాణ సమాజం పేరు చెప్పి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ తమను టార్గెట్ చేసిందని చెబుతూ సానుభూతి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. అన్నా చెల్లెలు మీడియా సమావేశాల్లో చెప్పినవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. “కల్వకుంట్ల కుటుంబం తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెతను తలపిస్తున్నది. ఢిల్లీకి వెళ్లండి.. అక్కడ మద్యం వ్యాపారం చేసి స్కాం చేయండి.. అక్రమంగా డబ్బులు పోగేసుకోండి అని తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు మీకేమైనా చెప్పారా? మీ అక్రమ వ్యాపారానికి, తెలంగాణ సమాజానికి ఎందుకు లింక్ పెడుతున్నారు? మహిళలు చీదరించుకునేలా అక్రమ వ్యాపారం చేసింది మీరు. ముఖ్యమంత్రి కూతురు, ఒక మహిళ ఢిల్లీ నడిబొడ్డున అక్రమ వ్యాపారం చేసినందుకు తెలంగాణ పరువు పోయింది.” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మద్యం కేసులో అరెస్ట్ కాబోతున్నారని తెలిసి మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరుతో కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా సానుభూతి కోసం చేస్తున్న డ్రామా అని ఆయనన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడుతున్నందుకు ఈడీ నోటీసులు ఇచ్చిందని చెబుతున్న కల్వకుంట్ల కుటుంబానికి ఆ బిల్లుపై మాట్లాడే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, ఇప్పటికీ రాజ్యసభకు ఆ పార్టీ ఒక్క మహిళను కూడా పంపలేదని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో శాసన మండలిలో ఆ పార్టీ ఎంత మంది మహిళలకు చోటు కల్పించిందని ప్రశ్నించారు. అలాంటి పార్టీకి మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి మాట్లాడే హక్కుందా అని ప్రశ్నించారు. జంతర్ మంతర్ కవిత దీక్షకు ఇప్పుడు మద్ధతు ప్రకటించిన సమాజ్వాదీ, ఆర్జేడీ వంటి పార్టీలు నాడు సభలో బిల్లును ఎందుకు వ్యతిరేకించాయో తెలుసుకోండి అని కవితను ఉద్దేశించి అన్నారు. అలాగే బీఆర్ఎస్ సన్నిహిత రాజకీయ పార్టీ మజ్లిస్ వైఖరి ఏంటో తెలుసుకోమని సూచించారు.
ఈడీ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని లేదంటే తమ ఇంటికే అధికారాలు రావాలని కవిత మాట్లాడుతున్నారని, ఈ దేశంలో ముఖ్యమంత్రుల పిల్లలకు ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ సమయంలో అడిగిన వెసులుబాటు కల్పించిందని గుర్తుచేశారు. కవిత మీరు అక్రమ వ్యాపారం చేయనట్లయితే.. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. లక్షల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని నిలదీశారు. “వ్యాపారం చేసింది మీరు.. అందులో అక్రమాలకు పాల్పడ్డది మీరు.. వాటిపై దర్యాప్తు చేస్తే తప్పు నరేంద్ర మోడీదా?” అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మోడీ టార్గెట్ చేశారని చెబుతున్నారని, మోడీ టార్గెట్ చేసేంత గొప్పవాళ్లయితే కాదని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, కల్వకుంట్ల కుటుంబ పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం కోరుకుంటోందని కిషన్ రెడ్డి అన్నారు. ఎవరు వద్దన్నా? కాదాన్నా? ఎవరు ధర్నా చేసినా.. కచ్చితంగా అవినీతికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తప్పు చేసినపుడు దర్యాప్తు సంస్థలు ప్రశ్నించడం సహజమేనని, ఆ విచారణను ఎదుర్కొనాలి తప్ప మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తప్పించుకోలేరని హితవు పలికారు. 2014లో అవినీతి వ్యతిరేక, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే నినాదంతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని.. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని కేంద్రమంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కుమారుడు కూడా తెల్లారి లేస్తే బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ కుటుంబానికి, ఆ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్న సందర్భంలో.. ఏం చేయాలో తోచక బీజేపీపై విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి అన్నారు.