న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్, కల్వకుంట్ల కుటుంబం నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో తాము లేమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీబీసీపై ఐటీ దాడులతో దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గురువారం ఢిల్లీ అశోక హోటల్‌లో జరిగిన టూరిజం ఇన్ మిషన్ మోడ్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మీడియా సంస్థలపై నిషేధం విధించిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. తమకు వ్యతిరేకంగా రాస్తున్నారంటూ తెలంగాణలో వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
పత్రికా స్వేచ్ఛను కాలరాసిన కల్వకుంట్ల కుటుంబం చేసే పనుల గురించి, వారి వ్యవహార శైలి ఎలాంటిదో తెలంగాణ సమాజానికి తెలుసునన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మీడియా సంస్థలపై దాడులు చేయడం లేదని, అది బీఆర్ఎస్ పార్టీకి అలవాటైన పని అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కుటుంబం పత్రికాస్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటమేంటని ఆయన అన్నారు.