Tuesday, November 19, 2024

విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ పనులకు తక్షణ చర్యలు.. జీవీఎల్ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం కేంద్రంగా కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్‌సీఓఆర్) పనులు చేపట్టేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే నిర్మించేందుకు భూమి, నిధుల లభ్యతకు హామీ ఇచ్చారు. శుక్రవారం పార్లమెంట్‌లో రైల్వేమంత్రిని కలిసిన జీవీఎల్ ఈమేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. కొత్త రైల్వే జోన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఎంపీ జీవీఎల్‌ తన లేఖలో పేర్కొన్నారు. రైల్వే జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి భూమి, నిధులు అందుబాటులో ఉన్నాయని రైల్వే మంత్రి తెలిపారు. ఆఫీస్ కాంప్లెక్స్‌కు త్వరగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని జీవీఎల్ కేంద్రమంత్రిని కోరారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి పర్యటనలను బట్టి ఈ అంశంపై దృష్టి పెడతామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వేజోన్‌ను త్వరగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కల త్వరలో సాకారం కానుందని జీవీఎల్ నరసింహారావు ఆనందం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను రూ. 400 కోట్లతో ఆధునీకరించే ప్రాజెక్టు, ఐఐఎం విశాఖపట్నం మొదటి దశ ఆధునిక క్యాంపస్, రూ.22,000 కోట్ల హెచ్పీసీఎల్ విస్తరణ, ఆధునికీకరణ ప్రాజెక్ట్‌తో పాటు క్రూయిజ్ టెర్మినల్, మెగా ఫిషింగ్ హార్బర్ సహా అనేక ఇతర ప్రాజెక్టులను విశాఖ రైల్వే జోన్‌ శంకుస్థాపనతో పాటు ప్రారంభించేందుకు త్వరలో విశాఖపట్నం సందర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరనున్నట్టు జీవీఎల్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement