చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకం విషయంలో ట్విట్టర్ సాగతీత ధోరణి వ్యవహరిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని సోషల్ మీడియా సంస్థలు నూతన ఐటీ చట్టాన్ని కచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఈ అంశంపై తాజాగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందేనని, ఎవరూ అతీతులు కారని ట్విట్టర్‌కు తేల్చి చెప్పారు. భారత్‌లో నివసిస్తూ, ఇక్కడే పనిచేస్తున్న వారందరూ దేశం నియమనిబంధనలను పాటించకతప్పదని స్పష్టం చేశారు. అశ్విని వైష్ణవ్ కేంద్ర క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. ఐటీ మంత్రి అయ్యాక తొలిసారి పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మరోవైపు ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకంపై ట్విట్టర్ వివరణ ఇచ్చింది. ఎనిమిది వారాల్లో పూర్తిస్థాయి చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకం పూర్తవుతుందని తన అఫిడవిట్లో వెల్లడించింది. తాత్కాలిక చీఫ్ కాంప్లయన్స్ అధికారిగా స్థానికుడినే నియమించినట్టు తెలిపింది. కాగా కొత్త ఐటీ చట్టాలపై ట్విట్టర్‌కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని తేల్చి చెప్పింది. భారత నిబంధనల మేరకు 8 వారాల్లోగా కంప్లైయన్స్ అధికారులను నియమిస్తామని ట్విట్టర్ పేర్కొనగా.. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్