న్యూ ఢిల్లీ – జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది.. ఈ మేరకు గురువారం మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ.. దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది.
కాగా, రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు. ముందుగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు.
కోవింద్ కమిటి సిపార్సులకు అనుగుణంగా..
జమిలి ఎన్నికలపై గతంలోనే కోవింద్ కమిటి 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2023, సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారధ్యంలో 191రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తిచేశారు. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫారసు చేసింది.
కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయ పడుతుందని పేర్కొంది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుందని.. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ భావించింది.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫారసు చేసింది. తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది.