కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జులై 22న పార్లమెంట్‌లో ఆర్ధిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగుతాయి. జులై 3న ఆర్ధిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరుగుతాయి.
జనరల్ ఎన్నికల మూలంగా 2023 ఫిబ్రవరి 1న ఆర్ధిక మంత్రి ని ర్మలాసీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వంలోనూ ఆర్ధిక మంత్రిగా నిర్మలాసీతారామన్ నియమితులయ్యారు. నరేంద్ర మోడీ మూడో టర్మ్‌లో ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్ ఇది.
దేశంలో వరసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలాసీతారామన్‌కే దక్కుతుంది. అంతకు ముందు మురార్జీ దేశాయ్ ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారు. ఈ రికార్డును నిర్మలాసీతారామన్ బ్రేక్ చేయనున్నారు. మురార్జీదేశాయ్ దేశానికి ఆర్ధిక మంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా సేవలు అందించారు.
నిర్మలాసీతారామన్ కంటే ముందు నరేంద్ర మోడీ మొదటి ప్రభుత్వం 2014-15 నుంచి 208-19 వరకు ఐదు సార్లు వరసగా అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికల తరువాత నిర్మలాసీతారామన్‌ను ఆర్ధిక మంత్రిగా నియమించారు. నిర్మలాసీతారామన్ కంటే ముందు ఇందిరా గాంధీ 1970-71 సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్ధిక మంత్రి. నిర్మలాసీతారామన్ రెండో మహిళా ఆర్ధిక మంత్రిగా రికార్డు నెలకొల్పారు.
అప్పటి నుంచి నిర్మలాసీతారామన్ వరసగా 5 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జనరల్ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఆమె ఆరు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మురార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరసగా 7 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకోనున్నారు.