Thursday, November 21, 2024

భార‌త ఫొటోగ్రాఫ‌ర్ల‌కు యునిసెఫ్ అవార్డులు..

ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవన స్థితిగతులకు అద్దం పట్టే 2021 సంవత్సరానికి అత్యుత్తమ చిత్రాలకు యునిసెఫ్‌ అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాది పోటీలో తొలి రెండు బహుమతులు భారత ఫొటోగ్రాఫర్లు గెలుచుకున్నారు. ఉష్ణమండల తుపాను ఫలితంగా తీర ప్రాంతాలను గంగానది ముంచెత్తగా, సర్వస్వం కోల్పోయి నిస్సహాయంగా నిల్చున్న ఓ చిన్నారి ఫొటోను యునిసెఫ్‌ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది. దీనిని ఫొటోగ్రాఫర్‌ భట్టార్జీ తీశారు. తీర ప్రాంతాల్లో ప్రకృతి ప్రకోపానికి సర్వం నష్టపోతున్న ఎన్నో కుటుంబాలు, బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల దీనగాథకు ఈ చిత్రం సజీవ సాక్ష్యంగా నిలిచింది.

గంగా నది పరీవాహక ప్రాంతమైన నంఖానా ద్వీపంలో 12 ఏళ్ల పల్లవి కుటుంబం జీవిస్తోంది. తండ్రి ట్రక్కు డ్రైవర్‌. పల్లవి సొంతంగా టీ దుకాణం పెట్టి కుటుంబానికి అండగా నిలిచింది. ఇలా సాగిపోతున్న వీరి జీవితాన్ని తుపాను అతలాకుతలం చేసింది. 2020లో పెను తుపాను కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. పల్లవి ఉంటున్న ఇల్లు, టీ దుకాణం ధ్వంసమయ్యాయి. వరద ప్రాంతాలను కవర్‌ చేసేందుకు వెళ్లిన ఫొటోగ్రాఫర్‌ సుప్రతిమ్‌ భట్టఛర్జీకి నిస్సహాయ స్థితిలో నిల్చున్న పల్లవి కన్పించడంతో వెంటనే ఆమెని ఫొటో తీశాడు. దీనికి ఈ యేటి మేటి చిత్రంగా తొలి బహుమతి లభించింది.

ద్వితీయ బహుమతి కూడా భారత ఫొటోగ్రాఫర్‌కే దక్కింది. మహారాష్ట్రకు చెందిన సౌరవ్‌ దాస్‌.. కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల పరిస్థితులను తన కెమెరాతో బంధించారు. మహమ్మారి తీవ్రత కారణంగా గతేడాది దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతబడ్డాయి. ఆన్‌లైన్‌ విద్య మొదలైంది. అయితే, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. అలాంటి పరిస్థితిలో దీప్‌ నారాయణ్‌ అనే ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశాడు. తన గ్రామంలోని ప్రతి ఇంటి గోడలను బ్లాక్‌బోర్డులుగా మార్చివేశాడు. విద్యార్థులను దూరం దూరం కూర్చుబెట్టి తరగతులు బోధించారు. అలా ఇంటి అరుగు మీద కూర్చుని విద్యార్థులు పాఠాలు వింటున్న దృశ్యాన్ని సౌరవ్‌ తన కెమేరాలో బంధించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement