26/11.. ఈ పేరు విన్నా.. ఈ సంఖ్య యాదికి వచ్చినా ఇప్పటికీ వణుకు మొదలవుతుంది. అంతటి ఘోరనాకి తెగబడ్డ టెర్రరిస్టులను నిలువునా నరికేయాలన్నంత కోపం చాలామందికి వస్తుంది.. అంతటి ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ అనే సినిమాను రూపొందించారు. ఇందులో సందీప్ పాత్రను అడివి శేష్ చేశారు. అయితే.. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 3వ తేదీన రిలీజ్ కానుంది. ఇంకా ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్, కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించారు. ఈ మధ్యనే విడుదలైన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. ఆ విధంగా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. అంతేకాకుండా పలు టీవీ చానెళ్లు, ఓటీటీల్లో కూడా జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అడివి శేష్. ఈ సందర్భంగా ‘మేజర్’ సందీప్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెప్పుకొచ్చారు.
సందీప్ జీవితంలో ఎన్నో షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయని అన్నారు అడివి శేష్. కార్గిల్ వార్ లో సందీప్ భుజానికి దెబ్బ తగిలిందని.. అంత బాధలో కూడా ఆయన గాయపడిన ఓ వ్యక్తిని భుజాన ఎత్తుకొని మంచులో 10 కిలోమీటర్లు నడిచారని శేష్ చెప్పుకొచ్చారు. అలాగే ఓసారి ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకొని తిరిగి ట్రైన్ లో వెళ్తుండగా.. సందీప్ ఫ్రెండ్ కూడా అతనితోనే ఉన్నాడని.. అతడు అస్సాం, సందీప్ బెంగుళూరు వెళ్లాలని.. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ దగ్గర డబ్బు లేకపోతే సందీప్ తన జేబులో ఉన్న మొత్తం డబ్బులు ఇచ్చేశారని అడివి శేష్ చెప్పారు.
ఆ తర్వాత బెంగుళూరు వచ్చేవరకు సందీప్ తన ప్రయాణంలో ఏమీ తినలేదని, మిలిటరీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదనే రూల్ ఉంటుందని.. ఇలా ఆయన లైఫ్ లో కదిలించే ఘటనలు చాలా ఉన్నాయని అన్నారు శేష్. కానీ ఇవన్నీ జనాలు నమ్ముతారో.. లేదో అని తమ సినిమాలో పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు అడివి శేష్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.