Tuesday, November 26, 2024

యూత్‌ డిక్లరేషన్‌కు అనూహ్య స్పందన.. కాంగ్రెస్‌లో జోష్‌ నింపిన సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒక వైపు సభలు, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్లుతున్నాయి. అందులో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా సభలు, గర్జనల పేరుతో పార్టీ కార్యక్రమాల జోరును పెంచింది. వివిధ రకాల డిక్లరేషన్లను ప్రకటిస్తూ.. ప్రజల మనుసు దోచుకునే పనిలో కాంగ్రెస్‌ నాయకులు నిమగ్నయమ్యారు. ఈ డిక్లరేషన్లకు ప్రజల నుంచి అనువ్యూహంగా స్పందన లభిస్తోందని, ఇదే ఊపును ఎన్నికల వరకు కొనసాగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తం అవుతుంది.

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ ప్రకటించిన యూత్‌ డిక్లరేషన్‌తో యువత నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. గాంధీ కుటుంబం ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన సోనియాగాంధీ ఎన్ని అడ్డంకులు కలిగినా.. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రకటించిన రైతు, యూత్‌ డిక్లరేషతో అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు.

- Advertisement -

గతేడాది మే 25న వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌..

2022 మే 25న వరంగల్‌ వేదికగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేతుల మీదుగా ‘రైతు డిక్లరేషన్‌’ను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ చేతుల మీదగా ‘నిరుద్యోగ డిక్లరేషన్‌’ ప్రకటింప చేసి యువతను తమ వైపు తిప్పుకునేందుకు కార్యాచరణను కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసుకున్నది. ఒక వైపు రైతులు, మరో వైపు యువతను ఆకర్షించేందుకు డిక్లరేషన్లు ప్రకటించిన హస్తం పార్టీ నాయకులు భవిష్యత్‌లో మరిన్ని డిక్లరేషన్లు ప్రకటించాలనే యోచనలో ఉన్నారు. ప్రధానంగా మహిళా సాధికారతతోపాటు ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా పథకాల రూపకల్పన చేయాలనే ఆలోచనతో పీసీసీ నాయకత్వం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అవి డిక్లరేషన్ల రూపంలో ఉండాలా? లేక ఎన్నికల మేనిఫెస్టోతో సరిపెట్టాలా? అనే అంశంపైన పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికే డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మానం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం, రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ తదితర అంశాలను హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్యాక్రమాలలో భాగంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికి క్షేత్రస్థాయిలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

ఇంటింటికి కరపత్రాల ద్వారా ప్రచారం..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, ఇచ్చిన హామీలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరేలా కార్యాచరణ తీసుకోవాలని.. అందుకు కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు చేసిన మేలును వివరిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే చేసే పనులను వివరించనున్నారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా రైతుల రుణాల మాఫీతో పాటు ఉచిత కరెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు ఉచితంగా వైద్య సేవల కోసం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీతో పాటు రైతు ఉత్పత్తి చేసిన ప్రతి ధాన్యపు గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం, ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచడం, గ్యాస్‌ ధర పెంపుతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం గ్యాస్‌ బండ ధర రూ.1,150 వరకు ఉందని, అదే గ్యాస్‌ను కాంగ్రెస్‌ రూ.500లకు ఇస్తామని చెబుతున్నారు. ఇలాంటి పథకాలతో కాంగ్రెస్‌ పార్టీ వైపు ఓటర్లు ఆకర్షితులు అవుతారనే ధీమాతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement